‘భజన’తో పోషకాహార లోపానికి చెక్.. ఈ మాట చెప్పింది మోడీయే : కేటీఆర్ సెటైర్లు

By Siva KodatiFirst Published Aug 31, 2022, 2:32 PM IST
Highlights

పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గమని స్వయంగా మోడీయే సెలవిచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్. అయితే ప్రధాని ప్రసంగంలో టెలీప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను భావిస్తున్నట్లు ఆయన అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి భజన చక్కని మార్గమని స్వయంగా మోడీయే సెలవిచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ప్రధాని ప్రసంగంలో టెలీప్రాంప్టర్ తప్పిదం అయ్యుంటుందని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు. టెలిప్రాంప్టర్‌లో పొరపాటున ‘భోజన్’ అనే పదానికి బదులుగా ‘భజన్’ అని టైప్ అయ్యుంటుందని మంత్రి పేర్కొన్నారు. 116 దేశాలున్న ప్రపంచ ఆకలి సూచిక జాబితాలో మనదేశం 101వ స్థానంలో వుందని.. దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. 

ఇకపోతే.. కేటీఆర్ మరోసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయన వెంటనే టెస్టులు చేయించున్నారు. ఈ క్రమంలో తనకు పాజిటివ్‌గా తేలిందని మంత్రి తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కేటీఆర్ సూచించారు. మంత్రి వైరస్ బారినపడటం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇకపోతే.. కొద్దిరోజుల కిందట కాలికి గాయం కావడంతో ఆయన ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. 

Also Read:తెలంగాణకు మోడీ ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని... ‘‘సున్నా’’ : కేటీఆర్ చురకలు

మరోవైపు.. తెలంగాణలో గత కొన్నిరోజులుగా బీజేపీ- టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. రాజాసింగ్ అరెస్ట్, బండి సంజయ్ పాదయాత్రకు బ్రేకులు వంటి ఘటనలతో ఇరు పార్టీల మధ్యా ఉప్పు నిప్పు మాదిరిగా పరిస్ధితి వుంది. ఈ నేపథ్యంలో శనివారం వరంగల్‌లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌లపై బీజేపీ నేతలు జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. దీనికి టీఆర్ఎస్ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. 

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన ఆయన.. మోడీ తెలంగాణకు ఏ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదని ఆరోపించారు. 2014కు ముందు 67 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే.. గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్ 16 కళాశాలలు మంజూరు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. 

click me!