
అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హైదరాబావ్ వీ హబ్ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే ఆలోచనను మన ఇంటి నుంచే నేర్పిస్తున్నామని కేటీఆర్ అన్నారు. తన తల్లిదండ్రులు తననే కాకుండా , తన చెల్లెలు కవితను కూడా బాగా చదివించారని.. ఇద్దరినీ సమానంగానే పెంచారని కేటీఆర్ గుర్తుచేశారు. కవిత అమెరికాకు వెళ్తానంటే తన కంటే ముందే పంపారని మంత్రి తెలిపారు. తాము కూడా తమ పిల్లలను సమానంగా చూస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇంజనీర్, డాక్టర్ , లాయర్ కావాలని ఇంట్లో చెబుతుంటారని.. వ్యాపారవేత్తలు అవ్వాలని ఎందుకు చెప్పరని మంత్రి ప్రశ్నించారు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికెళ్లాక బాస్ ముందు భయపడాల్సిందేనని కేటీఆర్ పేర్కొన్నారు.
స్త్రీ , పురుషులకు సమానంగానే ప్రతిభ వుంటుందన్న ఆయన.. అమ్మాయిలు కూడా వ్యాపారంలో రాణించాలని ఆకాంక్షించారు. అమ్మాయిలకు ఇష్టమైన చదువును తల్లిదండ్రులు చదివించాలని.. ఫెయిలైన సందర్భాల్లోనూ వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభించాలన్నారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని.. రూ.750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామన్నారు. ప్రతీ పారిశ్రామిక పార్కులో 10 శాతం ఫ్లాట్స్ మహిళలకు కేటాయించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ మూడు టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచే వచ్చాయని మంత్రి అన్నారు.