
ED notice to Kalvakuntla Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడంపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తీవ్రంగా స్పందించింది. రాజకీయ కుట్రలో భాగంగానే కవితకు ఈడీ నోటీసులు పంపారని మండిపడింది.
వివరాల్లోకెళ్తే.. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశరాజధాని ఢిల్లీలో మార్చి 10 ధర్నాకు దిగనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. అయితే, తాజాగా ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లను జారీ చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఘాటుగా స్పందిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ ఎస్ నేతలు స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల దాడిచేశారు. బీఆర్ఎస్ బలంగా ఎదుగుతుందనే భయంతోనే రాజకీయ కక్షతో కవితకు నోటీసు ఇచ్చారని వారు ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పీ.అజయ్ కుమార్ విమర్శించారు. ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గానికి ప్రతీక అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇది దర్యాప్తులో భాగంగా జారీ చేసిన నోటీసు కాదనీ, రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో ఇది భాగమని మంత్రి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. అయితే ఈ ఎత్తుగడలు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయవని ఆయన అన్నారు.
ఇలా చేయడం ద్వారా బీఆర్ఎస్ ను అడ్డుకోవచ్చని భావించే వారు మూర్ఖులనీ, నియంతలు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన అన్నారు. మోడీ దుశ్చర్యలు అంతం కాబోతున్నాయనీ, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ కు కేసులు, జైళ్లు కొత్త కాదనీ, 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు కేసీఆర్ ప్రజల కోసం పనిచేసే వారు కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కవితకు ఇచ్చిన నోటీసు విద్వేష రాజకీయాలకు పరాకాష్టగా మంత్రి అభివర్ణించారు. కేసీఆర్ ను ఎదుర్కోలేకనే రాజకీయ కక్షతో కవితను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను భ్రష్టు పట్టించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం వారి విశ్వాసాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన అదానీపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై మోడీ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీబీఐ వచ్చి కవితను విచారించి వెళ్లిపోయిందని, కానీ ఇప్పుడు ఈడీ అరుణ్ పిళ్లైని అరెస్టు చేసి కవిత బినామీ అని పిలిచిందని ఆమె అన్నారు. వారు వెంటనే ఆమెకు నోటీసులు జారీ చేసి రేపు హాజరుకావాలని కోరారనీ, ఇదంతా చూస్తే స్పష్టంగా కవితను నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెసుస్తోందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత ఢిల్లీలో నిరసన తెలపాల్సి ఉన్నందున ఆమె గొంతు నొక్కేందుకే ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. బీజేపీ పతనం తెలంగాణ నుంచే మొదలవుతుందని అన్నారు.