కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీపై యూటర్న్.. యువత కడుపుకొట్టారుగా : కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Mar 05, 2022, 09:36 PM ISTUpdated : Mar 05, 2022, 09:37 PM IST
కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీపై యూటర్న్.. యువత కడుపుకొట్టారుగా : కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

సారాంశం

రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణకు కేంద్రం మరో మోసం చేస్తోందని.. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టబోమని ప్రకటన చేశారని కేటీఆర్ మండిపడ్డారు. 

ఏపీ విభజన చట్టం (ap bifurcation act) ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీల్లో ఒకటైన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీపై (kazipet railway coach factory) కేంద్రం మాటమార్చడంపై మంత్రి కేటీఆర్ (ktr) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ (bjp) ప్రభుత్వం అవలంబిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలకు కొనసాగింపుగానే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (ashwini vaishnaw) మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు (itir project) , బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ (bayyaram steel plant) , సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతో పాటు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలులో నరేంద్ర మోడీ సర్కార్ తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తుందని మంత్రి దుయ్యబట్టారు. 

మోడీ ప్రభుత్వ తీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయంటూ ఎద్దేవా చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు ధోఖా ఇవ్వడంలో గత పాలకులను నేటి మోదీ సర్కార్ పాలన మించిపోయిందంటూ చురకలు వేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పచ్చి తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందనడానికి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరో ఉదాహరణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

బీజేపీ తెలంగాణ వ్యతిరేక వైఖరితో రాజ్యాంగబ‌ద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కకుండా పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చామన్న కేటీఆర్, ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి కూడా కేంద్రానికి ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స‌హా మంత్రులు, ఎంపీలు లెక్కలేనన్ని విజ్ఞప్తులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేంద్రం స్పందించలేదని ఫైరయ్యారు. 

దేశంలో ఎక్కడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదని 2017లో కేంద్రం ప్రకటించడం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అవమానించడమేనని కేటీఆర్ విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా తన రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర లాతూర్‌కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని (latur railway coach factory) నరేంద్ర మోదీ (narendra modi) ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. ఆ మరఠ్వాడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 625 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం తెలంగాణపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూపించిందంటూ కేటీఆర్ ఫైరయ్యారు. 

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దక్కిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కడం తెలంగాణ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న మోసపూరిత వైఖరిని బయటపెట్టిందని ఆయన విమర్శించారు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం చేసిన దగాతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా వరంగల్ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం  చేశారు . కోచ్ ఫ్యాక్టరీతో ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత కడుపు కొట్టిందని ఆగ్రహం  వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రపూరిత విధానాలను ప్రజలు తప్పక తిప్పికొడతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేంతవ‌రకు తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని మంత్రి హెచ్చరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు కేంద్రంలోని తమ ప్రభుత్వ ద్వంద్వ‌ వైఖరిని నిలదీయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా… రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకులు స్పందించకుంటే తెలంగాణ ప్రజలే తరిమి తరిమి కొడతారని కేటీఆర్‌ హెచ్చరించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu