బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతిలోనే వుంది.. బీజేపీది మాత్రం అదానీ దగ్గర : అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్

Siva Kodati |  
Published : Oct 10, 2023, 09:15 PM IST
బీఆర్ఎస్ స్టీరింగ్ మా చేతిలోనే వుంది.. బీజేపీది మాత్రం అదానీ దగ్గర : అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్

సారాంశం

ఆదిలాబాద్‌లో జరిగిన సభలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. భారత రాష్ట్ర సమితి కారు స్టీరింగ్ ముమ్మాటికి మా చేతుల్లోనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఆదిలాబాద్‌లో జరిగిన సభలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయని బీజేపీ.. ఈరోజు అడ్డగోలు ప్రచారం చేసుకుంటోందని మంత్రి దుయ్యబట్టారు. 

అమిత్ షా ప్రసంగాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్ చురకలంటించారు. కేవలం ఎన్నికలవేళ చేసే బీజేపీ జూమ్లాలు, అబద్దాలను విని విని దేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు విసిగిపోయారని కేటీఆర్ అన్నారు. దేశంలో పెరిగిన ధరల గురించి, పెరిగిన నిరుద్యోగం గురించి అమిత్ షా మాట్లాడితే మంచిదని మంత్రి సూచించారు. అమిత్ షాకు దమ్ముంటే అదాని గురించి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. 

నరేంద్ర మోడీ, అమిత్ షా అబద్ధాలకు ప్రభావితమయ్యే అవకాశం లేదన్నారు.  రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటూ  పచ్చి అబద్దాన్ని అమిత్ షా చెప్పి ప్రజలను మోసగించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకమైన రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి అన్నారు. రైతుబంధు కార్యక్రమాన్ని కాపీ కొట్టిన నరేంద్ర మోడీ , అమిత్ షాలు తెలంగాణ గడ్డ నుంచి అబద్దాలు ఆడారని దుయ్యబట్టారు. 

ALso Read: కవిత అరెస్ట్ కాకూడదు .. కేటీఆర్ సీఎం కావాలి, కేసీఆర్ లక్ష్యం ఇదే : అమిత్ షా వ్యాఖ్యలు

ఐదేళ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాలో ప్రసంగిస్తూ అదిలాబాదులో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరిపిస్తామని హామీ ఇచ్చారని.. కానీ నేటికీ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా వేయలేదని మంత్రి చురకలంటించారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా తెలంగాణకు చట్టప్రకారం దక్కాల్సిన ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా కేటాయించలేదన్నారు. ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ సందర్భంలో అమిత్ షా కొడుకు జై షా ఎక్కడ క్రికెట్ ఆడారో, ఎక్కడ ఎవరికి  కోచింగ్ ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

ఎలాంటి అర్హతలు లేకున్నా బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కొడుకు విషయంలో ఉన్న పరివార్ వాద లబ్ది గురించి అమిత్ షా మాట్లాడాలన్నారు. భారత రాష్ట్ర సమితి కారు స్టీరింగ్ ముమ్మాటికి మా చేతుల్లోనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని, బీజేపీల స్టీరింగ్ మాత్రం ముమ్మాటికి అదాని చేతిలో ఉందని చురకలంటించారు. అమిత్ షాకు , బీజేపీకి దమ్ముంటే తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు ఏం చేసిందో చెప్పి ప్రజల మద్దతు కోరాలన్నారు. తెలంగాణ ప్రజలు కచ్చితంగా  భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెబుతారని కేటీఆర్ అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu