సీఎం అభ్యర్థిగా బరిలోకి తీన్మార్ మల్లన్న.. ఆ పార్టీ టికెట్ పై పోటీ

By Mahesh KFirst Published Oct 10, 2023, 8:12 PM IST
Highlights

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ పార్టీ చీఫ్‌తో సమావేశమయ్యారు. ఆయనే సీఎం అభ్యర్థిగా, ఇతర సీట్లలోనూ అభ్యర్థులను నిర్ణయించే బాధ్యతను మల్లన్నకే అప్పజెప్పినట్టు తెలిసింది.
 

హైదరాబాద్: తీన్మార్ మల్లన్న సీఎం అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. గతంలో బీజేపీలోకి చేరి సందడి చేసిన తీన్మార్ మల్లన్న స్వల్ప సమయంలోనే పార్టీకి షాక్ ఇచ్చి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆ పార్టీ టికెట్ పై ఎన్నికల బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనీ కథనాలు వచ్చాయి. అంతేకాదు, సొంత పార్టీ నెలకొల్పి తాను, తన టీమ్‌నూ ఎన్నికల బరిలో నిలబెడుతారనే అభిప్రాయాలూ వచ్చాయి. కానీ, తాజాగా అందిన సమాచారం మాత్రం వీటన్నింటినీ పక్కకు నెట్టేసింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై పోటీ చేస్తారని, ఆయనే సీఎం అభ్యర్థిగా ఉంటారని తెలిసింది. అంతేకాదు, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఆయనే ఖరారు చేస్తారనీ సమాచారం అందింది.

కొన్నాళ్లుగా ఆయన మేడ్చెల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఇది వరకే చెప్పారు. అయితే, ఏ పార్టీ నుంచి ఆయన బరిలో దిగుతారనే విషయంపై స్పష్టత లేదు. ఆయన పార్టీ పెట్టే ప్రయత్నాలు చేయడం వాస్తవమే. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ కూడా చేసుకున్నారు. కానీ, కొన్ని న్యాయపరమైన, సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. అవి పరిష్కృతమై, గుర్తింపు లభించి, ఈ ఎన్నికల ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయడం సాధ్యమయ్యేలా లేదు. అందుకే తీన్మార్ మల్లన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆశ్రయించినట్టు సమాచారం.

Also Read: అలకబూనిన విజయశాంతి.. క్లారిటీ తీసుకున్న బీజేపీ.. అక్కడి నుంచి పోటీ చేస్తారటా!

గతంలో ఆయన కాంగ్రెస్‌తో మాట్లాడిన సరైన స్పందన రాలేదు. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో సమావేశమైనట్టు తెలిసింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు చేశారు. తమ పార్టీ తరఫున పోటీ చేయడానికి తీన్మార్ మల్లన్న, ఆయన టీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరిన్ని సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

click me!