పేపర్ లీక్‌పై వ్యాఖ్యలు.. గుజరాత్‌లో 13 సార్లు జరిగింది, మోడీని రాజీనామా అడగ్గలవా : సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్

By Siva KodatiFirst Published Mar 17, 2023, 6:38 PM IST
Highlights

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు . ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు కేటీఆర్ తెలిపారు. 
 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థపై ఆయనకు కనీసం అవగాహన లేదన్నారు. బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో తనకు అర్ధం కావడం లేదంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బోడి గుండుకు, మోకాలికి ముడిపెట్టినట్లు ధరణి పోర్టల్‌ , టీఎస్‌పీఎస్సీ అంశంతో తనపై ఆరోపణలు చేయడాన్ని సహించేది లేదన్నారు. బండి సంజయ్ చేస్తున్న కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నోసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు కేటీఆర్ తెలిపారు. మరి వీటిపై సంజయ్ ఏమంటారంటూ మంత్రి నిలదీశారు. ఈ లీకేజ్‌లకు సంబంధించి మోడీని బాధ్యుణ్ణి చేసి రాజీనామా డిమాండ్ చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మధ్యప్రదేశ్ వ్యాపం కేసు కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసునని కేటీఆర్ దుయ్యబట్టారు. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం సిట్‌ను నియమించిందని.. బాధ్యులైన వారిని తక్షణం అరెస్ట్ చేసిందని మంత్రి గుర్తుచేశారు. అర్హులైన అభ్యర్ధులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. 

ALso REad: పేపర్ లీక్ కేసు.. రాజశేఖరే ప్రధాన సూత్రధారి, ఉద్దేశ్యపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి : సిట్ నివేదికలో కీలకాంశాలు

యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లీకేజ్ ఘటనను బీజేపీ శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టీవ్ కార్యకర్తలని.. ఈ విషయం విచారణలో తేలిందని, దీని వెనుక కుట్ర చేసింది బీజేపీయేనని మంత్రి ఆరోపించారు. రాజకీయాల కోసం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల యువత అప్రమత్తంగా వుండాలని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలని ఆశయంతో తమ ప్రభుత్వం జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేటీఆర్ యువతకు విజ్ఞప్తి చేశారు. 
 

click me!