
బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), ఈటల రాజేందర్‌లపై (etela rajender) మండిపడ్డారు మంత్రి కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) . శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు (dalit bandhu) వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు. దళిత బంధు దేశం లొనే కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో మొదలైన పథకమని ఆయన ప్రశంసించారు. దళిత బంధు అమలు మొదలైందని, ఎన్నికల సమయంలో బీజేపీ ఫిర్యాదు వల్లే ఆగిందని కొప్పుల మండిపడ్డారు. బీజేపీ చెబితేనో, బండి సంజయ్ చెబితేనో తాము దళిత బంధు పథకాన్ని మొదలు పెట్టలేదన్నారు. బండి సంజయ్‌కు దళిత బంధుపై మాట్లాడే అర్హత లేదని కొప్పుల ఈశ్వర్ చురకలు వేశారు. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం పెట్టించాలని ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ నేతలు అబద్దాలతో మభ్యపెడుతున్నారని.. దళితులను మోసం చేస్తున్నారని కొప్పుల ఆరోపించారు. హుజురాబాద్‌లో (huzurabad bypoll) ఏక్కడా లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిందని ఆయన చురకలు వేశారు. ముందు ఆ మేనిఫెస్టోను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. ఉన్నత వర్గాలకు, అదానీ, అంబానీలకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ అయితే పేదల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్ అని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ (dharmapuri aravind) ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటూ హేళన చేశారని మంత్రి గుర్తుచేశారు.
దళిత జాతిని అవమాన పరిచిన ఎంపీ బీజేపీలోనే ఉన్నారని.. దళితులంటే అరవింద్‌కు చిన్నచూపా అని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీలు బహిరంగంగా సహకరించుకోవడం వల్లే హుజురాబాద్‌లో ఓడిపోయామని కొప్పుల వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని.. బీజేపీ దేశవ్యాప్తంగా 32 ఉపఎన్నికలు జరిగితే ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచిందని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ తో అనైతిక పొత్తుతో గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారని కొప్పుల మండిపడ్డారు. రాజేందర్ రాష్ట్రమంతా తిరిగితే బండి సంజయ్, లక్ష్మణ్ ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. అసలు ఈటల రాజేందర్ చివరి దాకా బీజేపీలో ఉంటారా అనేది అనుమానమేనని కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. రాజేందర్ ఆయానంతట ఆయనే టీఆర్ఎస్‌ను వీడి వెళ్లారని మంత్రి అన్నారు.
ఎక్కువగా ఊహించుకుని రాజేందర్ మాట్లాడుతున్నారని.. హుజురాబాద్ ఫలితంపై పార్టీలో తప్పక సమీక్ష చేసుకుంటామని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ గడువు ఉందని.. హుజురాబాద్‌లో మా ఓటమికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదని ఆయన చెప్పారు. అక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. బీజేపీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానాలని ఈశ్వర్ హితవు పలికారు. పెట్రోల్ డీజిల్ ధరలు (petrol diesel price) వంద రూపాయలు దాటించి కేవలం ఐదు రూపాయలు తగ్గిస్తే ఫలితం ఏంటని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలు అబద్దాలు మాని కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చేయాలని కొప్పుల డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఏం చేయరు చేసే వారిని విమర్శిస్తారని.. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఆగడం లేదని చురకలు వేశారు. కాంగ్రెస్ (congress) పార్టీలో హుజురాబాద్ ఫలితం చిచ్చు రేపుతోందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ (revanth reddy) , ఈటలతో కుమ్మక్కు కావడాన్ని కాంగ్రెస్ సినియర్లే తప్పు పడుతున్నారని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల నీతిమాలిన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. టీఆర్ఎస్‌కు ఉపఎన్నికలు , విజయాలు, అపజయాలు కొత్తకాదని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు.