సొంత జిల్లాలోనే మంత్రి గంగులకు చేదు అనుభవం... (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 5, 2021, 5:25 PM IST
Highlights

సొంత జిల్లా కరీంనగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది.   

కరీంనగర్ జిల్లా దుర్శేడ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. యాసంగి సాగు చేసుకోవాలో వద్దో... వడ్లు కొంటారో లేదో చెప్పాలంటూ మంత్రిని రైతులు నిలదీసారు. దీంతో వడ్లు కొనేది కేంద్రమేనని... రాష్ట్రం కాదని చెబుతూ మంత్రి గంగుల రైతులను సముదాయించే ప్రయత్నం చేసారు. 

karimnagar district రూరల్ మండలం దుర్శేడు, నగునూరుతో పాటు కొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం minister gangula kamalakar ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పంటల సాగుపై మంత్రిని నిలదీసారు. ప్రత్నామ్నాయ పంటలు ఏమి వేయాలో మాకు అవగాహన కల్పించాలని farmers గంగులను కోరారు. అసలు ఏం పంట వేయాలో తెలియడం లేదంటూ మంత్రిని ప్రశ్నించారు. 

వీడియో

దుర్శేడ్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి గంగుల మాట్లాడుతూ... పండించిన పంటను కొన్నప్పుడే రైతు సంతోషంగా ఉంటాడన్నారు. అందుకే సకాలంలో పంటలు కొనాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. వరిపంట కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని.. ఈ విషయంలో రైతులు కూడా సహకరించాలని గంగుల కోరారు. 

read more  దళిత బంధు అమలు కోరుతూ ఈ నెల 9న బీజేపీ ఆందోళనలు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పరిమితి పెట్టినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ప్రతి గింజా కొంటామని చెప్పారని మంత్రి గుర్తు చేసారు. 3-4 రోజుల్లోనే కొనుగోలు చేసిన పంటకు డబ్బులు కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో 6545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని... మరో నెల, 45 రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేసారు.

ఇప్పటికయితే గన్నీసంచుల కొరతలేదని... అయితే రైసుమిల్లుల్లో ఇప్పటికే ధాన్యం నిండుగా ఉండటం వల్ల ఒకేరోజు పెద్ద ఎత్తున కొనడం సాధ్యం కాదన్నారు. రైతులు టోకెన్ల వారిగా పంటను తీసుకురావాలని మంత్రి కోరారు.  

ఇది వ్యవసాయ దేశం కాబట్టి రైతు పండించిన ప్రతి పంటను కొనాలని మేము ఒత్తిడి తెచ్చామని గంగుల తెలిపారు. కానీ కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని మళ్లీ కొర్రీలు పెడుతున్నారని గంగుల ఆరోపించారు. రైతులు ఏ పంట పండించినా.. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోళ్లు చేయాలని మంత్రి డిమాండ్ చేసారు. యాసంగిలో కూడా కేంద్రం ధాన్యం కొనాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మా వెంట వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి గంగుల డిమాండ్ చేసారు. 

ఇదిలావుంటే ఇటీవలే వరి సాగు, ధాన్యం కొనుగోలుపై అధికార టీఆర్ఎస్ పార్టీ గందరగోళం సృష్టిస్తోందన్నారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంజయ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని సీఎం కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారని గుర్తుచేసిన సంజయ్ ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. 


 

click me!