ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ.. హరీష్ రావు

By Sumanth KanukulaFirst Published Feb 6, 2023, 12:38 PM IST
Highlights

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు కీలక ప్రకటనలు చేశారు.

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పలు కీలక ప్రకటనలు చేశారు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చేయనున్నట్టుగా చెప్పారు. సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి తీసుకురావాలని ప్రభుత్వం  నిర్ణయించిందని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా చేస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పారు. 

ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టుగా మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక విద్యకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, భదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాటిటెక్నిక్ కాలేజ్‌లను ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు.  జెఎన్‌టీయూ పరిధిలో 4 కొత్త ఇంజనీరింగ్ కాలేజ్‌లను ఏర్పాటు  చేస్తున్నట్టుగా తెలిపారు. అందులో సిరిసిల్ల, వనపర్తి కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యామని.. త్వరలోనే మహబూబ్ నగర్, కొత్తగూడెంలలో ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. గతంలో చెప్పిన విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో వంటపనిచేసే 54,201 మందికి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచినట్టుగా తెలిపారు.   

‘‘రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో రూ. 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలకన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారు’’ అని మంత్రి హరీష్ రావు చెప్పారు. 

click me!