బలగం మొగిలయ్యకు మంత్రి హరీష్ అండ... అధికారులకు వెంటనే ఆదేశాలు

By Arun Kumar PFirst Published Mar 30, 2023, 5:01 PM IST
Highlights

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. 

హైదరాబాద్ :తెలంగాణ సాంప్రదాయాలకు సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన 'బలగం' సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. చనిపోయిన తర్వాత కాకిముట్టుడు అనే చిన్న లైన్ ను సినిమా కథగా తీసుకుని అచ్చ తెలంగాణ పల్లె సంస్కృతిని చూపించారు. నిజ జీవితానికి దగ్గరగా వుండే ఈ సినిమా కొందరు కళాకారులను వెలుగులోకి తెచ్చింది. అలాంటి వారిలో పస్తం మొగిలయ్య ఒకరు. 

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు బలగం సినిమాలో భార్యతో కలిసి కనిపిస్తాడు. తోబుట్టువులు ఎలా వుండాలో చెబుతూ ఈ దంపతులు పాడిన పాట ప్రతిఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. కేవలం మొగిలయ్య పాటే కాదు నిజజీవితంలో ఆయన  పరిస్థితి కూడా కన్నీరు పెట్టేలా వుంది. రెండు కిడ్నీలు పాడయిపోయి, వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నాడు. అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. 

మొగిలయ్య కుటుంబ సభ్యుల కోరిక మేరకు కావాల్సిన మందులు అందించేలా ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి హరీష్ ఆదేశించారు. కిడ్నీలు పాడయిపోయిన అతడికి సమయానికి డయాలసిస్ సేవలు అందేలా చూడాలని సూచించారు. అంతేకాదు ఇప్పటికే మొగిలయ్య ఆరోగ్యం దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తి హెల్త్ చెకప్ కూడా చేయించాలని ఆదేశించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేసాక తిరిగి అంబులెన్స్ లోనే ఇంటికి చేర్చాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మొగిలయ్యకు అండగా నిలిచి మంత్రి హరీష్ కు ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Read More  బలగం డైరెక్టర్ వేణుకు దిల్ రాజు ఎన్ని కోట్లు ఇచ్చాడు?... ఇదిగో క్లారిటీ!

 ఇక ఇప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చికిత్స పూర్తయ్యేవరకు వైద్య ఖర్చులకు ఎన్ని లక్షలైన సరే లైన్ఆప్ క్రెడిట్ చెక్ (ఎల్ఓసీ) ద్వారా అందజేస్తామని... ఎల్ఓసీ ప్రొసీజర్ వెంటనే ప్రారంభించి ఒకటి/రెండు రోజుల్లో వైద్యం కొరకు మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ బాధ్యతను స్థానిక నాయకులు రైతు సమన్వయ సమితి బాధ్యులు తోకల నరసింహారెడ్డికి అప్పగించారు. 

మొగిలయ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని... ఆయన త్వరలోనే కోలుకుంటారని ఎమ్మెల్యే అన్నారు. తన కళ ద్వారా తెలంగాణ సంస్కృతికి జీవంపోసి అనేక మందిని అలరించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. 

ఇక ఇప్పటికే మొగిలయ్యను వెలుగులోకి తీసుకువచ్చిన బలగం డైరెక్టర్ వేణు ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి ఆర్థిక సాయం కూడా చేసారు.బలగం విడుదల తర్వాత మొగిలయ్య దంపతులను కలిపిన లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు.  
 

click me!