
అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాదయాత్రలు ఎలా చేస్తారని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (minister harish rao) అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో రూ. రెండు కోట్ల EGS, CSR నిధులతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ నాయకులు పాదయాత్ర ఎందుకోసం చేయాలనుకుంటున్నారో చెప్పాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల రిజర్వేషన్ లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా ? వడ్లు కొననందుకా ? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నందుకా ? వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా ? నిరుద్యోగుల కు జాబ్ లు ఇవ్వనందుకా లేక ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bjp state president bandi sanjay), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (central minister kishan reddy) తెలియజేయాలని అన్నారు. తాను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తరువాతే పాదయాత్ర చేపట్టాలని తెలిపారు. అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారని అన్నారు.
ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయాల సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తమ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతామని అన్నారు. పెంచేటోడు బీజేపీ అయితే.. పంచేది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఎవ్వరూ కావాలో.. ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. ఈ అంశాలపై గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు విస్తృతంగా చర్చించాలని అన్నారు.
సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే ఉండేదని అన్నారు. స్వరాష్ట్రంలో ఏ కాలంలో చూసినా వానాకాలం లాగే ఉందని తెలిపారు. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీయాలి. తెలంగాణలో ఉపాధి హామీ కూలీల 3 వేల కోట్ల పని దినాలను తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని తెలిపారు. రాష్ట్ర కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్ల కు పెంచేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరో సారి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14 వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. దీని కోసం దాదాపుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఇటీవలే ప్రకటించింది. ఈ యాత్ర ద్వారా బీజేపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బండి సంజయ్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.