ఒక్కొక్కరికి రూ.78,624 బకాయి పడ్డారు.. అది వృద్ధుల ఉసురు పోసుకోవడమే : కేసీఆర్‌పై బండి సంజయ్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Mar 31, 2022, 04:22 PM IST
ఒక్కొక్కరికి రూ.78,624 బకాయి పడ్డారు.. అది వృద్ధుల ఉసురు పోసుకోవడమే : కేసీఆర్‌పై బండి సంజయ్ ఆగ్రహం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఆసరా  పెన్షన్ల అంశంపై గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో 11 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.

పింఛన్ల (aasara pension) అంశానికి సంబంధించి తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) గురువారం లేఖ రాశారు. ఆసరా పింఛన్ల వయో పరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన 11 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గ చర్యలు ప్రారంభించకపోవడం శోచనీయమంటూ దుయ్యబట్టారు. కొత్తగా పింఛన్లకు అర్హులైన వారు ఏళ్ల తరబడి అధికార పార్టీ నేతలు, అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందన్నారు. 

కుటుంబంలో ఆసరా పింఛను పొందే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలో అర్హులు ఉంటే పింఛను కొనసాగించాలని బండి సంజయ్ కోరారు. అలా కాకుండా ఒక కుటుంబానికి ఒక పింఛను అని నిర్ణయించడం అన్యాయమన్నారు. ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్నవారి ఉసురుగొట్టుకునే చర్య అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 2018 డిసెంబరులో ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని, దాంతో గడచిన 39 నెలల్లో ఒక్కో ఆసరా లబ్దిదారుడికి ప్రభుత్వం రూ.78,624 బకాయి పడిందన్నారు. ఆ బకాయిలను వృద్ధులకు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

అంతకుముందు బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం KCR అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ పాలనా వైఫల్యం వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ పత్రిక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, మిగులు రాష్ట్రమని చెబుతూనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పాలనపై బండి సంజయ్ మండిపడ్డారు. 

రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని బండి సంజయ్ విమర్శించారు.  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.  రోజుకో జిల్లాకు జీతాలు చెల్లిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు  జీతాల చెల్లింపు రెండు ప్రతి నెల రెండో వారానికి చేరుకుందని సంజయ్ ఆరోపించారు. 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉద్యోగులకు జనవరి నెల జీతం ఇంకా చెల్లించలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. 

జీపీఎఫ్ లో ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదన్నారు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం దాచుకున్న డబ్బులు చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేసుకొంటే ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్పోరేట్ ఆసుపత్రులు ఉద్యోుగులకు వైద్యం చేయడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !