
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటికే రెండ్రోజుల పాటు బీఆర్ఎస్ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తాజాగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. ఆదివారం హరీశ్ రావు సమక్షంలో జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎకరానికి 3 గంటలు కరెంట్ చాలంటున్నారని.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడికి రేవంత్ అసలైన వారసుడిగా మారారంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఎమ్మెల్యేగా వున్నప్పుడు ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ అన్నారని మంత్రి గుర్తుచేశారు. కరెంట్ ఎవరి పాలనలో బాగుందని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయని.. రైతులకు 3 గంటలు కరెంటు కావాలో, 24 గంటలు కావాలో తెలియదా అని మంత్రి వ్యాఖ్యానించారు.
ALso Read: Revanth reddy: రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో అడగండి: రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తొలి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేనని.. హైదరాబాద్ స్టేట్‌ను ఏపీలో కలిపింది కాంగ్రెస్సేనని, తెలంగాణను ముంచేసే పోలవరానికి కారణం కాంగ్రెస్సేనని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకునేలా కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. భూసేకరణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ కావాలని పొరుగున వున్న మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపించుకుంటారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.