వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్లు ఉంది.. శివరాజు సింగ్‌ చౌహాన్‌పై హరీష్ రావు ఫైర్

By Sumanth KanukulaFirst Published Jan 8, 2022, 1:52 PM IST
Highlights

భారతీయ జనతా పార్టీపై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై (shivraj singh chauhan) తెలంగాణ మంత్రి హరీష్ రావు (harish rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు.

భారతీయ జనతా పార్టీపై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై (shivraj singh chauhan) తెలంగాణ మంత్రి హరీష్ రావు (harish rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు. శివరాజ్ సింగ్ మాటలు.. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాకాహారి అన్నట్లు ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుక్కొని శివరాజ్ సింగ్.. సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. 

నాలుగు సార్లు సీఎం అయి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం చేశారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణతో శివరాజ్ సింగ్ రాష్ట్రానికి ఎందులో పోలికో సమాధానం చెప్పాలని అన్నారు. ఏ రంగంలో వారి రాష్ట్రం అభివృద్ది సాధించిందని ప్రశ్నించారు. స్థానిక నేతలు రాసిచ్చిన స్రిప్ట్‌ను శివరాజ్ సింగ్ చదువుతున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం సంగతేమిటని ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు చనిపోగా.. ఉద్యోగాలు అంగట్లో అమ్ముడుపోయాయని అన్నారు. ఇప్పటివరకు దోషులు ఎందుకు బయటపడటం లేదని నిలదీశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. 

బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలి.. మంత్రి తలసాని
మరో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) కూడా శివరాజ్ సింగ్‌ చౌహాన్‌పై ఫైర్ అయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ దొడ్డిదారిన సీఎం అయ్యారని విమర్శించారు. అక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టి, ఎమ్మెల్యేలను కొని సీఎం అయ్యారని అన్నారు. తెలంగాణ అభివృద్దికి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్దిపై చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు తెలంగాణకు టూరిస్టులుగా వస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ నేతల బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని అన్నారు. ఉద్యోగుల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ నేతలు పద్దతులు మార్చుకోవాలన్నారు. 

ఇక, శుక్రవారం రోజున హైదరాబాద్‌కు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్.. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం శివరాజ్ సింగ్ దుయ్యబట్టారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని .. బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు ఆయన చెప్పారు. 

మీ బెదిరింపులకు బీజేపీ భయపడదని... కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ గుర్తొస్తున్నారంటూ చౌహన్ చురకలు వేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. కేసీఆర్ నేను కూడా సీఎంనే, నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంనంటూ సెటైర్లు వేశారు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదని శివరాజ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైందని.. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.  2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్  జోస్యం చెప్పారు.

click me!