
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో (Palwancha family suicide case) ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర రావు (vanama raghavendra rao) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం రాత్రి వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. అతడిని కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్ జైలుకు తరలిస్తున్నారు.
ఇక, ఈ కేసుకు సంబంధించిన వివరాలను నేడు ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. నాగ రామకృష్ణ.. భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు సాహితీ, సాహిత్యలపై పెట్రోల్ పోసి, తాను కూడా నిప్పంటించుకున్నాడని చెప్పారు. ఘటనస్థలంలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య చనిపోగా.. పెద్ద కూతురు సాహిత్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 5వ తేదీన మృతిచెందిందని చెప్పారు. రామకృష్ణ బావమరిది జనార్ధన్ రావు ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్పారు. సూసైడ్ నోట్, సెల్పీ వీడియోలో రామకృష్ణ.. ప్రధానంగా వనమా రాఘవేంద్రతో పాటుగా తన అక్క, తల్లిపై ఆరోపణలు చేసినట్టుగా చెప్పారు.
నిందితులను పట్టుకోవడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామని తెలిపారు. తమకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం దమ్మపేట మండలంలోని మందలపల్లి వద్ద వనమా రాఘవేంద్రను కస్టడీలోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు. అనంతరం వారిని ఏఎస్పీ ఆఫీసులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందన్నారు. వనమా రాఘవేంద్రతో పాటు గిరీష్, మురళీని కస్టడీలోకి తీసుకున్నట్టుగా చెప్పారు. రాఘవేంద్ర పారిపోవడానికి చామా శ్రీనివాస్, రమాకాంత్ సహకరించినట్టుగా గుర్తించామని తెలిపారు. వీరి నలుగురిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
రామకృష్ణను బెదిరించినట్టుగా రాఘవేంద్ర అంగీకరించినట్టుగా ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. వనమా రాఘవేంద్రతో పాటు అరెస్ట్ చేసిన వారిలో పలు అంశాలపై విచారించినట్టుగా ఏఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు రాఘవేంద్ర 12 కేసులు ఉన్నాయని తెలిపారు. పూర్తి దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించారు. రాఘవేంద్రను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్టుగా చెప్పారు. రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణల మీదల, నమోదైన కేసుల సమాచారం సేకరిస్తున్నామని.. విచారణలో ఉందని వివరాలను వెల్లడించలేమని చెప్పారు. రాఘవేంద్రకు సహకరించిన నిందితులకు నోటీసులు ఇచ్చామని.. వారు స్పందించకపోతే చట్టప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. రాఘవేంద్రకు వైద్య పరీక్షలు చేయించినట్టుగా ఏఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఆయనకు హైబీపీ ఉందని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.