డాక్టర్ అయ్యుండి.. వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ మాటలేంటీ : గవర్నర్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 9, 2022, 6:49 PM IST
Highlights

వైద్యులు, తెలంగాణ వైద్య శాఖపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తుంటే, మీరు విమర్శలు చేస్తారంటూ గవర్నర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. 
 

రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. వైద్యుడి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. కేంద్రం పరిధిలోని బీబీ నగర్ ఎయిమ్స్‌కు గవర్నర్ వెళ్లి చూడాలని హరీశ్ రావు చురకలు వేశారు. ఒక డాక్టర్ అయ్యుండి అలా మాట్లాడటం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించిందని మంత్రి గుర్తుచేశారు. ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారంటూ గవర్నర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read:గవర్నర్ బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు.. తెలంగాణ చరిత్ర ఆమెకు తెలియదు: మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతోందని.. ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కిట్, ఇతర చర్యల వల్ల 2014 లో 30 శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 66 శాతం చేరాయని హరీశ్ వెల్లడించారు. హెల్త్ అండ్ వెల్నెస్ ర్యాంకింగ్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. మలేరియా నివారణలో 2 నుండి కేటగిరీ 1కి రాష్ట్రం అభివృద్ధి చెందిందని కేంద్రమే వెల్లడించిందని హరీశ్ రావు గుర్తుచేశారు. 

ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం వల్ల, ఆశాలు ఏఎన్ఎంలు మా వైద్యాధికారులు ఎంతో కృషి చేయడం వల్ల సాధ్యమైందని ఆయన వివరించారు. ఇది గవర్నర్‌కి ఎందుకు అర్థం కావడం లేదు...ఒక డాక్టర్‌గా మీరు తెలుసుకుని మాట్లాడాలని హరీశ్ రావు హితవు పలికారు. తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఎయిమ్స్‌లో లేవని హరీశ్ రావు చురకలు వేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైందని.. పేషెంట్లు లేరు, డెలివరీలు కావు, కనీస సౌకర్యాలు ఉండవని మంత్రి ఎద్దేవా చేశారు. 
 

click me!