హిమంత బిశ్వ శర్మపై దాడి కేసీఆర్ కుట్రే... పోయే కాలం వచ్చింది , అందుకే ఇలా : ఈటల రాజేందర్

By Siva KodatiFirst Published Sep 9, 2022, 6:10 PM IST
Highlights

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని.. అందుకే ఈ గణేశ్ ఉత్సవాల వేళ ఈ తరహా చర్యలకు దిగారని రాజేందర్ ఆరోపించారు. 

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై టీఆర్ఎస్ నేతలు దాడికి యత్నించడంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ స్వయంగా ప్లాన్ చేసి హిమంత బిశ్వ శర్మను అవమానించాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. దీనికి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని రాజేందర్ డిమాండ్ చేశారు. ఇలాంటివి పిరికిపందల చర్యలేనన్న ఈటల.. ప్రజల విశ్వాసం వున్న వారు ఇలాంటి చర్యలకు పాల్పడరని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని.. అందుకే ఈ గణేశ్ ఉత్సవాల వేళ ఈ తరహా చర్యలకు దిగారని రాజేందర్ ఆరోపించారు. 

తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇలాంటి చర్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఈటల చెప్పారు. చిల్లర మాటలు మాట్లాడటంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని రాజేందర్ చురకలు వేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పనులకు దిగాలని అనుకున్నప్పుడు పక్కా ప్లానింగ్‌తో పోలీసుల పర్యవేక్షణలోనే చేస్తుందని ఆయన ఆరోపించారు. మరి కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటెలిజెన్స్ ఇన్ని వుండగా.. సీఎం స్థాయి వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించారంటే దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం వుందని ఈటల వ్యాఖ్యానించారు. 

ALso Read:హైద్రాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత: అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

దీనిపై ఖచ్చితంగా కేంద్రం ఆరా తీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని సంస్థల్ని అపహాస్యం చేసినట్లే , అన్ని రకాల సాంప్రదాయాలను తుంగలో తొక్కినట్లు గవర్నర్‌ని కూడా అవమానించే పరిస్ధితి మన దగ్గర వుందని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా ఒక గవర్నరే అని ఆయన పేర్కొన్నారు. గవర్నర్, సీఎం అనే పదవులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినవేనని ఈటల తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగవని.. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. 

click me!