
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉత్తమ సలహా ఇచ్చారు. తెలంగాణ సర్కారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అలా అడ్డు తగలకుండా ఉండాలంటూ ఒక ఉత్తమ సలహా ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజలు, రైతులు అన్ని వర్గాల వారు మద్ధతు ప్రకటిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరవాలని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణ, హరిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పక్షాన ప్రజలు ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందని మంత్రి చెప్పారు. రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాగు, సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను ప్రజలు నిండు మనస్సులో ఆశీర్వదించారన్నారు.
ప్రజాక్షేత్రం వదిలిపెట్టి గ్రీన్ ట్రిబ్యునల్‌లు కోర్టుల చుట్టూ తిరగడం కాంగ్రెస్ నేతలు మానుకోవాలి. 15 జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. మనుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణ కల్పించిందన్నారు. చౌకబారు ప్రచారం కోసం ప్రతిపక్షం ఆరాటపడవద్దు. తెలంగాణ తాగు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మరి హరీష్ రావు ఇచ్చిన సలహాను కాంగ్రెస్ నేతలు పాటిస్తారా? లేక తమ పని తాము చేసుకుపోతామని చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.