వరంగల్ లో ఆరని కొత్త జిల్లాల చిచ్చు

First Published Aug 26, 2017, 6:32 PM IST
Highlights
  • వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం చిచ్చు
  • మాకే కావాలంటున్న నర్సంపేట 
  • మాకివ్వాలంటున్న పరకాల
  • రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆందోళనలు
  • సర్కారు పెద్దలకు ముచ్చెమటలు

తెలంగాణ సర్కారు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రేపటి దసరాకు ఏడాది కావొస్తున్నది. అయినా ఆ చిచ్చు ఇంకా రగులుతూనే ఉన్నది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. దీంతో తమ ప్రాంతంలోనే జిల్లా కేంద్రం నెలకొల్పాలంటూ ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. మొన్నటికి మొన్న పరకాల బంద్ సంపూర్ణంగా జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం పరకాలలోనే ఉండాలంటూ అఖిలపక్షం ఆద్వర్యంలో బంద్ చేపట్టారు. ఇది ఇలా ఉండగానే నర్సంపేటలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.

తాజాగా నర్సంపేటలో దిగ్బంధం చేపట్టారు. నర్సంపేటను వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన తీవ్రతరం చేసింది టిడిపి. శనివారం టిడిపి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ దిగ్బంధం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కొత్త జిల్లాలు ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్నా కొత్త జిల్లాల్లో కొత్త ఉద్యోగాల జాడే లేదని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల్లో డబుల్ బెడ్ రూమ్ లు మంజూరీ లేదన్నారు. ఇది ముమ్మాటికీ తుగ్లక్ పాలనే అని విమర్శించారు. నర్సంపేట పట్టణానికి ఆరు ప్రధాన రహదారులు ఉన్నాయని, అందుకే పది మండలాలను కలుపుకొని నర్సంపేట ను వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

మొత్తానికి వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు అంశం తెలంగాణ సర్కారుకు ఇరకాటంలో పడేసేవిధంగా ఉంది. దీనిపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొద్దిగా కసరత్తు చేసినా ఈ అంశం ఏటూ తేలలేదు. రోజు రోజుకూ ఈ విషయం వివాదాస్పదమవుతున్నది.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!