కేసీఆర్ కు వెన్నుపోటు... టీఆర్ఎస్ ను చీల్చడానికి ఈటల కుట్రలు...: మంత్రి గంగుల సంచలనం

By Arun Kumar PFirst Published Aug 10, 2021, 5:24 PM IST
Highlights

మంత్రివర్గంలో వుండగా ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కే వెన్నుపోటు  పొడవాలని చూశాడని... టీఆర్ఎస్ పార్టీని చీల్చి ముఖ్యమంత్రి కావాలని నీచంగా ఆలోచించాడని గంగుల కమలాకర్ ఆరోపించారు.  

కరీంనగర్: తెలంగాణలో నేతన్నల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తాజాగా పద్మశాలి భవన్ కోసం ముఖ్యమంత్రి హుజురాబాద్ లో ఎకరం స్థలం కేటాయించడమే కాదు కోటి రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. పద్మశాలీల సంక్షేమం చూడాలని ముఖ్యమంత్రి తనకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని గంగుల పేర్కొన్నారు. 

''కరీంనగర్ లో మాదిరి హుజురాబాద్ లోనూ పద్మశాలీల ఆత్మగౌరవ భవనం కోసం గతంలో ఎన్నోసార్లు ఈటెల రాజెందర్ కు విజ్ణప్తి చేసినా పట్టించుకోలేదని పద్మశాలి సంఘం నాయకులు మురళి చెప్పినప్పుడు చాలా బాదకలిగింది. అంతేకాదు మీకెందుకు భవనం అని ఈటల అవహేళన కూడా చేశాడట. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాల్సిన ఎమ్మెల్యే పదవిలో వున్న ఈటెల అలా మాట్లాడడం సిగ్గుచేటు'' అని గంగుల మండిపడ్డారు. 

''మీ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రుష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించారు. పద్మశాలీలు నోరుతెరచి అడగని ఆత్మాభిమానం కల బిడ్డలని... వారు అడిగిన  దానికన్నా మంచిగా ఎకరం భూమితో పాటు నిధుల్ని మంజూరు చేశారు. 10గుంటలు అడిగితే ఎకరం, 50 లక్షలు అడిగితే 1కోటి రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ఒకవైపు... చులకనగా మాట్లాడి అవహేళన చేసిన ఈటెల మరోవైపు... ఎవరివైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకోవాలి'' అని మంత్రి అన్నారు. 

''నగరానికి అందుబాటులో భూమిని కేటాయించాం. దళిత, బహుజన, బీసీలపై అత్యధిక అభిమానం కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాకముందు సిరిసిల్ల గోడలపై నేతన్నల ఆత్మహత్యలు వద్దనే రాతల్ని చూసి చలించిపోయిన ఉద్యమ నేత కేసీఆర్ జోలె పట్టి రూ.50లక్షలు పోగుచేసి అందించారు. ఆనాడే నేతన్నల్ని ఆదుకోవాలన్న గట్టి సంకల్పం కేసీఆర్ తీసుకున్నారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఉండేది... ఆకలి చావులు నిత్యక్రుత్యంగా వుండేవి. స్వరాష్ట్రం సాదించిన వెంటనే వాటిని రూపుమాపాలని నిరంతరం కేసీఆర్ క్రుషి చేస్తున్నారు'' అని తెలిపారు.

read more  కేసీఆర్ ఒక్క మాట చాలు... రేవంత్ రోడ్డుపై తిరగలేడు: ఎమ్మెల్యే సైదిరెడ్డి వార్నింగ్

''నేతన్నల కోసం నాణ్యమైన కరెంటుతో పాటు, ఆధునిక యంత్రాలను, చేతినిండా పనికోసం బతుకమ్మ చీరలను అందించారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర, పావలా వడ్డీ పథకం, బ్లాక్ లెవల్ చేనేత సమూహాలు, క్యాష్ క్రెడిట్ సదుపాయం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వాటి సాయంతో ఇప్పుడిప్పుడే నేతకారి కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఇంకా ఆర్థికంగా, సామాజికంగా అన్నిరంగాల్లో నేతన్నలు ప్రగతి సాధించాలని మార్కండేయ స్వామిని వేడుకున్నారు'' అని తెలిపారు. 

''కేసీఆర్ అందర్నీ సమున్నతంగా గౌరవించారు... ఈటలను సైతం అదేరీతిలో చూసుకున్నారు. కానీ కేవలం మంత్రిపదవి సరిపోదని ముఖ్యమంత్రి స్థానం కోసం ఆయన కుట్రలు పన్నారు. పార్టీని చీల్చడానికి ప్రయత్నించి కేసీఆర్ కి వెన్నుపోటు పొడవాలనుకున్నాడు. ఇంత నీచ వ్యక్తిత్వం ఈటలది. ప్రజలకు కేసీఆర్ అందించే మంచి పథకాల్ని వద్దని చెప్పిన వ్యక్తి ఈటల.  ఇరవై నాలుగ్గంటల ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మీ, రైతుబందు వంటి పథకాల్ని వ్యతిరేకించిన ప్రజాద్రోహి ఎవరో గ్రహించాలి. మంచివారెవరైనా అన్నం పెట్టిన వారిని దీవిస్తారని, కానీ అన్నం పెట్టిన వ్యక్తికి సున్నం పెట్టిన ఈటెల లాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే నిర్ణయించుకొండి'' అని ప్రజలకు సూచించారు మంత్రి గంగుల.

''కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటల్లో ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి దగ్గర సమస్యలు ప్రస్తావించి అభివృద్ధి చేసుకున్నాం. ఈటలకు ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అయినా హుజురాబాద్  అభివృద్ధి గురించి ఏనాడు సీఎంకు నిధులు అడగలేదు. ఇక్కడి ప్రజల గురించి మాట్లాడకుండా కేవలం తన స్వప్రయోజనాలే ఈటెల చూసుకున్నారు. ఈ వెనకబాటు తనాన్ని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లగానే రూ.50కోట్లు విడుదల చేయడమే కాకుండా పనుల్ని నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షిస్తుంది. ఇవి ఎన్నికల కోసం చేసినవి కాదని హుజురాబాద్ వెనుకబాటుతనాన్ని పారద్రోలడానికే'' అని గంగుల పేర్కొన్నారు. 

''ఈటెల రాజీనామ చేసింది స్వప్రయెజనం కోసమే. పాదయాత్ర చేసే వారెవ్వరైనా గతంలో ఉన్న ఎమ్మెల్యే సరిగా పనిచేయలేదు... ఏ సమస్యా పరిష్కరించలేదు... అభివృద్ధి నిరోదించాడు కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఈటెల రాజెందర్ గత ఇరవై ఏళ్లుగా హుజురాబాద్ లో అధికారంలో ఉన్నాడు. మంత్రి పదువులు కూడా అనుభవించారు. అయినా ఎందుకు నియోజకవర్గాన్ని అభివృద్ధిచేయలేదో ప్రజలు ప్రశ్నించాలి'' అని గంగుల సూచించారు.

 
 

click me!