సభలు పెట్టుకోండి.. కానీ, తెలంగాణపై దాడిని సహించం.. ప్రజల మనోభావాలు దెబ్బతీశారు: బీజేపీపై ఎర్రబెల్లి ఆగ్రహం

Published : Jul 04, 2022, 06:51 PM IST
సభలు పెట్టుకోండి.. కానీ, తెలంగాణపై దాడిని సహించం.. ప్రజల మనోభావాలు దెబ్బతీశారు: బీజేపీపై ఎర్రబెల్లి ఆగ్రహం

సారాంశం

బీజేపీ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణలో సభలో పెట్టుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పట్లేదని, కానీ, తెలంగాణపై దాడి ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీ సభల్లో సీఎం కేసీఆర్ పై జరిగిన దాడి అంతా ఇంతా కాదని, ఈ దాడితో ప్రజల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్ అయ్యారు.  

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభల్లో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బీజేపీపై మండిపడ్డారు. సభలు పెట్టుకోండి.. అందుకు అభ్యంతరమేమీ లేదని, కానీ, తెలంగాణపై దాడి చేయడం ఎందుకు? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌పై మాటలతో దాడికి దిగి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. అసలు బీజేపీ నేతలంతా జాతీయ సభలకు వచ్చారా? లేక తెలంగాణపై దాడికి దిగడానికే వచ్చారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో సభలు పెట్టుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి ఎర్రబెల్లి  దయాకర్ రావు అన్నారు. కానీ, ఆ సభల పేరుతోనే తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై దాడికి దిగడమే ఇక్కడ తాము వ్యతిరేకిస్తున్నదని వివరించారు. ఈ సభల పేరుతో సీఎం కేసీఆర్‌పై జరిగిన దాడి అంతా ఇంతా కాదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ చేసిన దాడిని యావత్ తెలంగాణ ప్రజానీకంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు.

ప్రధానమంత్రి మోడీ హుందాగా ఉన్నట్టు కేసీఆర్ పేరు ఎత్తరని, కానీ, ఆయన భక్తగణం అంతా దాడి చేస్తారని మంత్రి అన్నారు. నేరుగా సీఎం కేసీఆర్‌పై దాడి చేశారని, రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆరోపించారు. బీజేపీకి దక్షిణ రాష్ట్రాల్లో అధికారం సంపాదించాలనే యావ ఉన్నదని, అందులోనూ తెలంగాణలో అధికారం చేపట్టాలనే లోచన తప్పితే ప్రజల జీవితాలు, అభివృద్ధి, సంక్షేమాలపై వారికి ఆలోచనలే లేవని దుయ్యబట్టారు. బీజేపీ నేతలకు అబద్ధాలు వల్లించి, మోసం చేసి, మత విద్వేషాలు రగిల్చి, వర్గాల మధ్యయ వైషమ్యాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటారని ఆరోపణలు చేశారు. కానీ, ఉత్తరాదిన చేసినట్టుగా బీజేపీ ఇక్కడ చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పేశారు. బీజేపీ ఆటలు ఇక్కడ సాగవని స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజలు అన్నీ లోతుగా గమనిస్తున్నారని వివరించారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్