
తెలంగాణలో పాలు వెల్లువ మొదలయింది. తెలంగాణ వచ్చినంక పాలువోయడంసంప్రదాయమయింది. నాయకులందరి మీద పాలు గుమ్మరించి కృతజ్ఞత చెప్పడం తెలంగాణ నేతలకు ఆనవాయితీ అయింది. పోలు పోయడం స్వామి భక్తి . సంతోషం పట్టలేక నేతల పటాలకు పాలతో అభిషేకం చేయడం కొత్త రాష్ట్రమంతా జోరుగా సాగుతూ ఉంది. పనిలోపని, పాలకిక డిమాండ్ పెరుగుతందిలే.
గత మూడేళ్ల కాలంలో వందలసార్లు తెలంగాణ సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాల కుంభవృష్టి కురిసింది. టిఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులతోపాటు పలు వాణిజ్య, వ్యాపార వర్గాలకు చెందిన వారంతా ఈ పాలాభిషేకాలు జరిపారు.
అయినదానికి కానిదానికి కూడా మన వాళ్లు ముందు పాలు గమ్మరించమంటున్నారు. ఇటు నుంచి సిఎం ప్రకటనలు గుప్పించడం... అటు నుంచి ఆయన చిత్ర పటానికి పాల ధారలు కురిపించడం ఏకకాలంలో సాగిపోయాయి. కొందరు దిగువ స్థాయి ఉద్యోగులు ఉద్యమాలు చేసిన సమయంలో వారి పట్ల కఠినంగా వ్యవహరించారు సిఎం కెసిఆర్. ఉద్యమాలు చల్లారిన తర్వాత అకస్మాత్తుగా ఆ ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కువగా జీతాలు పెంచి ఆశ్చర్యానికి గురిచేశారు. అంతే, రాష్ట్రంలో పాలు వెల్లువ షురూ అయింది. ఉద్యోగులు పాల పాకిట్లు కత్తిరించి సిఎం ఫొటోలపై గుమ్మరించేందుకు పోటీ పడ్డారు.
ఇలా సాగిపోతున్న పాలాభిషేకాల తీరు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. వనపర్తి జిల్లాకేంద్రానికి చెందిన గులాబీ దళం ఈ వ్యవహారంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వారు ఏకంగా సిఎంతోపాటు ఆయన తనయుడు మంత్రి కెటిఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్ర పటాలను సైతం జత చేసి పాలాభిషేకాలు జరిపించారు.
ఈ వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురికి పాలాభిషేకాలు జరపడానికి అంత గొప్ప పని ఏం జరిగిందో అని అనుమానాలు రావడం సహజం. అయితే వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు సంబంధించిన జిఓపై మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న కెటిఆర్ గురువారం సంతకం చేశారు.
పాలాభిషేకం అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారి జివొ సంతకం సువర్ణావకాశమయింది. ఫోటోలో చూడండి పాలెలో బిందెలతో పోశారో.
ఈ మాత్రం సంతకానికే పాలాభిషేకాలు చేయడం పట్ల వనపర్తి కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రోడ్లు మొత్తం పూర్తి చేసినట్లు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో ఈ పాలాభిషేకాల వ్యవహారం రానున్న రోజుల్లో ఏవిధంగా ముందకు సాగుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ముందు ముందు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, జడ్పీటీసీలకు, ఎంపిటీసీలకు, సర్పంచులు, వార్డు సభ్యులకు సైతం పాలాభిషేకాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు.
ఏదో విధంగా పాల డిమాండ్ పెరగుతూ ఉంది కదా, సంతోషిద్దామా!