ఉస్మానియా గొంతు నొక్కేస్తవా?

First Published Jun 9, 2017, 11:04 AM IST
Highlights

ఉస్మానియాలో రాజకీయ కార్యకలాపాలను రద్దు చేయడమంటే ఉద్యమ పతాకను అవనతం చేయడమే నంటున్నారు  ప్రజా తెలంగాణా కన్వీనర్ శ్రీశైల్ రెడ్డి.దీనికి ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను నిందిస్తున్నారు. "ఉద్యమ నెలబాలుళ్ళ ఉసురు తీస్తున్నవ్. నీ కుటుంబం, నీ కుల పెద్దలు, నీ మత పెద్దల మాట విని చెడిపోతున్నవ్. నిరసనను సహించలేక పోతున్నవ్. భజనలు తప్ప మరేమీ వినపడని స్థాయికి దాదాపు చేరిపోయినవ్."

 

 

 

 

ఉస్మానియా గొంతు నొక్కేస్తవా? - నవ్వు తెప్పిస్తున్నవ్ కేసీఆర్!

అయినా, యెంత ప్రయత్నించినా నీ మీద కోపం రావడం లేదు.  మహా అయితే జాలి కలుగుతున్నది. ఒక ఉద్యమ పతాక ఇంత త్వరగా అవనతం అవుతది అనుకోలేదు ఏనాడూ! పది జిల్లాల నీ పిల్లలు ఎదురెదురు చూసిన ఆ రోజులు మర్సిపోయినవ్. కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నికల్లో పోలిగ్ ఏజెంట్లు కూడా లేని గ్రామాల్లో యువకులు ఊగిపోయి కారుకు గుద్దేసిన్రు ఓట్లు.  ఇపుడు ఆ యువతను కారుతో తొక్కించి మురుస్తున్నవ్. మంచిది కాదు మీకు! 

ఉద్యమ నెలబాలుళ్ళ ఉసురు తీస్తున్నవ్. మీ  కుటుంబం, మీ  కుల పెద్దలు, నీ మత పెద్దల మాట విని చెడిపోతున్నవ్. నిరసనను సహించలేక పోతున్నవ్. భజనలు తప్ప మరేమీ వినపడని స్థాయికి దాదాపు చేరిపోయినవ్. 

తెలంగాణ గర్వించే వందేళ్ళ ఉస్మానియా తల్లికి పనికిరాని కొడుకువు కావద్దు మూడేండ్ల తర్వాత వొచ్చిన కొడుకును చూసి 'బాగున్నవా బిడ్డా' అన్న తల్లి పిలుపు వినపడలేదు. దించిన తల ఎత్తలేదు మొన్న మీరు.  నీ ఆలోచనల స్వార్థపు బరువులో తల నేలకు వేలాడింది. అపుడైనా కొంచెం సోయి వస్తది అనుకుంటి. పిచ్చి ముదిరిపోయింది.  ధర్నా చౌక్ పరాభవానికి, ప్రజా నిరసనకు - ఉన్న కొంచెం మతీ పోయిందా? ఈరోజు ఉస్మానియా యూనివర్శిటీలో సభలు సమావేశాలు వద్దని వేషాలేస్తున్నవ్. చదువుల కోసమే యూనివర్శిటీ అని నీ పలుకు వీసీ పలుకుతూ ఉంటే, ఈ కొడుకులేనా నా భూమిని అమ్మేస్తా అన్నది, వీళ్ళేనా ఈ రోజు చదువు మాటలు చెప్తున్నది అంటూ విస్తుపోతున్నది ఉస్మానియా తల్లి. 

చదువు అంటే, ప్రజా జీవన కాంక్షలు నిజం చేయడం కాదా? చదువు అంటే పల్లె బతుకుకు సశాస్త్రీయ అర్థాలు వెతకడం కాదా, జనం వ్యథలకు రాజకీయ, సాంస్కృతిక సమాధానాల అన్వేషణ కాదా? 

ఈ అష్టావక్ర సంతానాన్ని చూసి ఉస్మానియా తల్లి గుండె తల్లడిల్లుతున్నది. 

. ప్రశ్నతో పెట్టుకోకు. యువతతో పెట్టుకోకు. 

లేకపోతే, కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడు చెప్పిన 'ఈ కర్ణులు పదివేవురయిన...' నీ పట్లా నిజం అవుతుంది. మీ ముగ్గురు రాం'లు (రామోజీ, రామానుజ జీయర్, రామేశ్వరరావు), నీ కుటుంబమూ... ఒక్కరూ  ఒక్కరూ ఆదుకోరు  మిమ్మల్ని. 

నెత్తురు కక్కుతూ నేలకు రాలిన ఆ రోజు... మీ  వైరి శిబిరంలో వీరంతా చేరుతారు. అపుడు కూడా, ఇంత జరిగినా కూడా, తెలంగాణ సమాజం మిమ్మల్ని 'అయ్యో కేసీఆర్ అంటుంది. 

ఎందుకంటే, నీకొక చరిత్ర వున్నది. చేరిపేసుకోకు. 

ప్రేమతో

తెలంగాణ బిడ్డడు 

 

(*రచయిత ప్రజా తెలంగాణ కో-కన్వీనర్;ఉస్మానియా యూనివర్శిటీలో  చదవు తప్ప మరొక ముచ్చటొద్దు అని బుధవారం నాడు వైస్ చాన్సలర్ రామచంద్రం నిషేధం విధించారు. ఉస్మానియా నిషేధం మీద ఆయన సొంత స్పందన ఇది. ఉస్మానియా చర్య మీద చర్చకు ఆహ్వానం )

click me!