TSRTC: హైదరాబాద్‌లో కొత్తగా ‘పురుషులకు మాత్రమే’ బస్సు

By Mahesh KFirst Published Feb 1, 2024, 5:09 PM IST
Highlights

టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ రూట్‌లో పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ బస్సును నడపడానికి నిర్ణయించుకుంది. 
 

Men Only: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. చాలా వరకు బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో పురుషులు నిలబడి వెళ్లుతున్నారు. కొందరైతే.. డబ్బులు చెల్లించి టికెట్ కొన్న తాము నిలబడి వెళ్లాలా? అంటూ ప్రశ్నలు కూడా వేశారు. ఈ తరుణంలో టీఎస్ఆర్టీసీ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్‌లో పురుషుల కోసమే స్పెషల్ బస్సు ప్రారంభించింది.

అయితే, ఇది అన్ని రూట్‌లలో అందుబాటులో లేదు. ఒక్క ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ రూట్‌లోనే ఒకే ట్రిప్‌లో ఈ బస్సు అందుబాటులో ఉన్నది. ఈ రూట్‌లో ఆర్టీసీలో ప్రయాణించే యువకుల సంఖ్య భారీగా ఉండటంతో టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ రూట్‌లో కాలేజీలకు వెళ్లే యువత సంఖ్య ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఆ రష్ అవర్‌లో బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎస్ఆర్టీసీ పీఆర్వో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. 

Also Read: Barrelakka: యూట్యూబర్ పై బర్రెలక్క తీవ్ర ఆగ్రహం.. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే?

ఈ రూట్‌లో పలు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, కాబట్టి, ఆర్టీసీలో ప్రయాణించే యువత సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నదని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోనే ఈ బస్సును ప్రారంభించినట్టు వివరించారు. ప్రస్తుతానికైతే ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం మధ్య ఒక బస్సు నడుస్తున్నదని వివరించారు. ఉదయం 8.30 గంటలకు ఈ ‘పురుషులకు మాత్రమే’ స్పెషల్ బస్సు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు రిటర్న్ అవుతుందని పీఆర్వో తెలిపారు.

click me!