ఇసుక మాఫియాకు కేటీఆరే బాస్ : మావోయిస్టు పార్టీ

First Published Aug 4, 2017, 7:18 PM IST
Highlights
  • ఇసుక మాఫియాకు బాస్ కేటిఆరే
  • టిఆర్ఎస్ నేతలు కొండలు, గుట్టలు దోచుకుంటున్నారు
  • సిరిసిల్లలో యాక్సిడెంట్ల రూపంలో హత్యలు చేస్తున్నారు
  • కెసిఆర్, కెటిఆర్ తొత్తులైన ఎంపిలు, ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతాం

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియాకు నాయకుడు మంత్రి కేటీఆర్ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో విమర్శించారు. నీళ్లు, నిధులు నియామకాలు అనే నినాదంతో.. కోస్తాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ వనరులను తరలించుకపోవడాన్ని వ్యతిరేకిస్తూ వనరుల సంరక్షణ నినాదంతో తెలంగాణ పోరాటం నడిచింది. కాని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొండలు, గుట్టలు, గోదావరి ఇసుకను తరలించి వేలకోట్ల వ్యాపారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ రెండు జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలు, వాళ్ల కుటుంబాలు ఈ ఇసుకతో వేలకోట్ల ఇసుక మాఫియాను నడుపుతున్నారని.. వీళ్లందరికీ నాయకుడు కేటీఆర్ అని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ వనరులను తరలించడానికి టీఆరెస్ ఓ మాఫియాను తయారు చేసిందని ఆయన్ ఆరోపించారు. వనరులను రక్షించుకోవడానికి ఆ మాఫియాను అడ్డుకుంటున్న ప్రజలను బెదిరింపులకు గురిచేయడమే కాకుండా యాక్సిడెంట్ల ద్వారా హత్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక, గ్రానైట్ తరలింపుకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేరెళ్ల ప్రజలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, జైలు పాలు చేశార‌ని ఆయన అన్నారు. ఇదంతా కేటీఆర్ ఆదేశాలతోనే జరుగుతోందని జగన్ మండిపడ్డారు. పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వనరులను.. ముఖ్యంగా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఉత్తర తెలంగాణ గ్రామాలను వల్లకాడుగా మార్చి పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్, కేటీఆర్‌లకు, వారికి తొత్తులుగా పనిచేస్తున్న వరంగల్, కరీంనగర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంతృలు, వారి బందువులకు ప్రజలు తప్పక బుద్ది చెబుతారని జగన్ హెచ్చరించారు. నేరెళ్ళ గ్రామ ప్రజలు, దాని చుట్టూ గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించిన జగన్ పోరాట ప్రజలకు విప్లవ జేజేలు పలికారు. మాఫియాకు వ్యతిరేకంగా మరింత ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

వనరుల పరిరక్షణ ఉద్యమంలో నేరెళ్ళ ప్రజల పోరాటం తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శంమవుఇతుందని ఆయన అన్నారు. ఇసుక మాఫియాకు బలైపోయిన నేరెళ్ల వాసుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వాళ్ల పోరాటానికి మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని జగన్ పేర్కొన్నారు. నేరెళ్ళ పోరాటం విజయవంత కావాలని, కేటీఆర్ తో సహా దోషులందరికీ శిక్ష పడే వరకు మావోయిస్టు పార్టీ ప్రజలతో ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.

click me!