
వైసిపి అధినేత జగన్ ఏకకాలంలో చంద్రబాబుకు, కెసిఆర్ కు ఇద్దరికీ కాక పుట్టించాడు. రాజకీయ దిగ్జజాలుగా పేరొందిన చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ జగన్ వైఖరి కారణంగా ఇరకాటంలోకి నెట్టబడ్డారు. జగన్ ఆంధ్రా రాజకీయాల్లోనే కేంద్రీకరించినా ఆయన చేసిన పని తెలంగాణలో టిఆర్ఎస్ అధినేతను కూడా ఇబ్బంది పెట్టేలా ఉంది.
రాజకీయాల్లో పట్టుమని పదేళ్లు కూడా నిండని పార్టీ వైసిపి. జగన్ రాజకీయాల్లోకి వచ్చి కూడా పదేళ్లు మించలేదు. అయినా రాజకీయాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఒక నీచ సాంప్రదాయాన్ని ఎండగట్టారు జగన్. గురువారం నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరారు. భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనే శిల్పా చక్రపాణిరెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాసి జగన్ కు అందజేశారు.
బహిరంగసభ కంటే ముందే వైసిపిలో చేరాలంటే కచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. వేరే ఆల్ట్రనేట్ లేదు అని ఖరాఖండిగా శిల్పా చక్రపాణికి తేల్చి చెప్పారు జగన్. దీంతో తాను ఎమ్మెల్సీగా గెలిచి కేవలం 90 రోజులై అయినా, మరో ఐదేళ్ల తొమ్మిదినెలల కాలం ఎమ్మెల్సీగా అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ జగన్ సూచన మేరకు శిల్పా తన రాజీనామా పంపక తప్పలేదు.
ఇటీవల కాలంలో తెలుగు రాజకీయాల్లో ఒక పార్టీలో గెలవడం తర్వాత స్వప్రయోజనాలు ఆశించి అధికార పార్టీ పంచన చేరడం పరిపాటిగా మారింది. తెలంగాణలో తొలుత ఈ వికృత క్రీడ షురూ అయింది. టిడిపిలో గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తర్వాత ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు కెసిఆర్. తర్వాత ఇక కాంగ్రెస్, టిడిపి, వైసిపి, సిపిఐ సభ్యులంతా రకరకాల ప్రయోజనాలు ఆశించి అధికార టిఆర్ఎస్ గూటికి చేరారు. వీరంతా బంగారు తెలంగాణ కోసమే టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని అనేక సందర్భాల్లో ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు వ్యతిరేకించారు. తీవ్రంగా విమర్శించారు. అపవిత్ర సంసారం చేస్తున్నారంటూ విమర్శల వర్షం కురిపించారు బాబు. కానీ కొంతకాలానికి ఆయన కూడా కెసిఆర్ బాటలోనే నడిచారు. వైసిపి నుంచి ఎమ్మెల్యేలను టిడిపిలోకి తెచ్చుకున్నారు. ఇది చాలదన్నట్లు కెసిఆర్ కేవలం ఒకే మంత్రి పదవి ఇస్తే బాబు మాత్రం నాలుగు మంత్రి పదవులు ఇచ్చి కెసిఆర్ కంటే నేనే గ్రేట్ అనిపించుకున్నారు.
అనేక సందర్భాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజీనామాల కోసం పెద్ద పోరాటాలే నడిచాయి. తొలినాళ్లలో టిడిపి శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని భారీ స్థాయిలో పోరాడారు. కానీ తర్వాత ఆయన పార్టీ మొత్తాన్ని టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో రెండు రాష్ట్రాల్లో స్పీకర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిర్ణయం వెలువరించకుండా నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నారు.
రాజీనామాలు అనేది టిఆర్ఎస్ కు మంచినీళ్లు తాగినంత ఈజీ. తెలంగాణ రాకముందు అనేకసార్లు రాజీనామాలు చేసిన ఘనత ఆ పార్టీకి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధైర్యంగా రాజీనామాలు చేసిన టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, ఇంత బలంగా తయారైన తర్వాత మాత్రం రాజీనామాలు అంటే ఎందుకో భయపడుతున్నది. బంగారు తెలంగాణ కోసం వచ్చిన ఒక్క ఎమ్మెల్యేను కూడా రాజీనామా చేయాలని టిఆర్ఎస్ చెప్పలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి ధైర్యం కూడా ఇప్పుడు చూపడంలేదు టిఆర్ఎస్ పార్టీ.
ఇక జగన్ మాత్రం పార్టీ మారే విషయంలో ముందునుంచీ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. తన పార్టీలో ఎవరు రావాలన్నా రాజీనామా చేయాల్సిందేనన్న ప్రిన్సిపుల్ పక్కాగా పాటిస్తున్నారు. పసికూన పార్టీ, కొత్త నాయకుడైనా రాజకీయ కురు వృద్ధులుగా ఉన్న వారికి పాఠాలు చెబుతున్న తీరు మాత్రం తెలుగు నేల మీద చర్చనీయాంశమైంది.