
హైదరాబాద్: టమాటా ధరలు గత కొద్దిరోజులుగా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా చోట్ల కేజీ టమాటా రూ. 100కు పైనే పలుకుతుంది. దీంతో టమాటాలు చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని జహీరాబాద్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున 75 కిలోల టమోటాలను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. హెల్మెట్ ధరించిమూడు టమాటా ట్రేలను ఎత్తుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
జహీరాబాద్ మార్కెట్‌కు సమీప గ్రామానికి చెందిన ఓ రైతు ఆదివారం తెల్లవారుజామున కూరగాయల మార్కెట్‌కు టమోటాలు తీసుకొచ్చాడు. ఓ కమిషన్ ఏజెంట్ గోడౌన్‌లో వాటిని ఉంచి బయటకు వెళ్లాడు. అయితే తిరిగి వచ్చేసరికి మూడు టమాటాలు కనిపించలేదు. అయితే అక్కడి సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలించగా.. ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్‌పై వస్తున్నట్లుగా కనిపించింది. అతడు టమాటాలతో నిండి ఉన్న మూడు ట్రేలను.. ఒక్కొక్కటి చొప్పున బైక్‌పై మూడు ట్రిప్పులు వేసి అక్కడి నుంచి ఎత్తుకెళ్లాడు.
ఈ ఘటనకు సంబంధించి రైతు జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో టమాటా దొంగను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, టమాటా ధరలు విజృంభించిన తర్వాత.. దేశంలోని వివిధ ప్రాంతాలలో టమాటా చోరీ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.