మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ.. పలుమార్లు లైంగిక దాడి.. పోక్సో కోర్టు సంచలన తీర్పు..

By Rajesh Karampoori  |  First Published Oct 17, 2023, 1:19 AM IST

పొక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు విధించింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధుడికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో నేరస్తుడికి  భూపాలపల్లి పోక్సో కోర్ట్ జడ్జి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. పది వేల జరిమానా విధించారు.


మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి బెదిరించిన వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ భూపాల్ పల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకెళ్తే..  ఘణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కీర్తి నరేష్ అనే యువకుడు అదే మండలంలోని పొరుగు గ్రామానికి చెందిన మైనర్ బాలికపై గతేడాది నవంబర్ 1 న అత్యాచారం చేశాడు. ఈ సందర్భంగా ఆ కామాంధుడు ఫోటోలు తీశాడు. వాటి ఆధారంగా  బ్లాక్ మెయిల్ చేస్తూ మైనర్‌పై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  

అసలేం జరిగింది?

Latest Videos

నిందితుడు నరేష్  మైనర్ బాలిక ఫొటోలు, వీడియోలు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి ఆమెపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలిపింది. లైంగిక వేధింపుల గురించి బయటపెడితే.. చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో తల్లిదండ్రులు చిట్యాల పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలిని ముందుగా భరోసా కేంద్రానికి తరలించారు. అనంతరం ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసి.. నిందితుడిపై POCSO చట్టం కింద కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.  

20 ఏళ్ల జైలు శిక్ష

భూపాల్ పల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, పోక్సో కేసుల ప్రత్యేక న్యాయమూర్తి పి నారాయణబాబు పూర్తి వాదనను విన్నారు. ఈ కేసు రికార్డులను విశ్లేషించిన జడ్జి... నిందితుడు నరేష్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. దాంతో పాటు 10,000 జరిమానా కూడా విధించారు. భరోసా కేంద్రంలో ఉన్న బాధితురాలి కుటుంబానికి పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా బాలికకు వైద్య, ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని సూచించింది. ఈ కేసు విచారణను చిట్యాల సర్కిల్ ఇన్ స్పెక్టర్ పులి వెంకట్ చేపట్టారు. శిక్షను ఖరారు చేయడంలో సహకరించిన పోలీసు అధికారులను ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.

click me!