
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సమీపంలో గురువారం పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైకోర్టు గేట్ నెంబర్ 6 సమీపంలో గురువారం ఉదయం అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని సులభ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న మిథున్‌గా గుర్తించారు. వివరాలు.. గురువారం ఉదయం మిథున్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై అతి దారుణంగా చంపేశాడు.
అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, రోడ్డు మీద వెళ్తున్నవారు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, బాధితుడికి, నిందితుడికి మధ్య రూ. 10వేల విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.