బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిరి అతడు కొడుకు వరస అవుతాడని తెలిసి క్యాన్సిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది.
హైదరాబాద్ :పెళ్ళి కావడంలేదని తీవ్ర మనస్థాపానికి గురయిన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇప్పటికే రెండు సంబంధాలు కుదిరినట్లే కుదిరి క్యాన్సిల్ కావడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇక తనకు పెళ్లి కాదేమోనని భయపడిపోతూ కొంతకాలంగా మనోవేదన అనుభవిస్తున్న సదరు యువ పోలీస్ ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలుకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు సురేఖ(28) హైదరాబాద్ చత్రినాక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. తల్లిదండ్రులు, సోదరిని కూడా తనవెంటే హైదరాబాద్ కు తీసుకువచ్చిన సురేఖ అలియాబాద్ కాల్వగడ్డ ఏడుగుళ్ళ ప్రాంతంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకుని వుంటోంది.
కోరుకున్నట్లు ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక సురేఖకు పెళ్ళి చేయాలని తల్లిదండ్రులు భావించారు. గతేడాది ఓ యువకుడితో ఆమెకు పెళ్ళి సంబంధం కుదిరి క్యాన్సిల్ అయ్యింది. తాజాగా గ్రామానికే చెందిన బంధువుల యువకుడితో సురేఖ పెళ్లి కుదిరింది. అయితే ఆ యువకుడి సురేఖకు కొడుకు వరస అవుతాడని తెలిసింది. అంతేకాదు ఇద్దరి జాతకాలు కుదరకపోవడంతో ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది.
ఇలా వరుసగా రెండు పెళ్లి సంబంధాలు కుదిరినట్లే కుదిరి క్యాన్సిల్ కావడంతో సురేఖ తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. పెళ్లీడు దాటిపోతున్నా ఇంకా పెళ్లి కాకపోవడంతో ఆమె మనోవేదనకు గురయ్యింది. ఇలా పెళ్ళి కోసం ఆలోచిస్తూ క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది.
Read More షాకింగ్... మాజీ సైనికుడి భార్యను విదేశాలకు అమ్మిన హైదరాబాద్ ఏజెంట్లు.. ఆమె ఎలా తప్పించుకుందంటే...
మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సురేఖ ఆత్మహత్య చేసుకుంది. ఇంటి లోపలినుండి గడియ పెట్టుకుని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది.బుధవారం ఉదయం ఆమె చెల్లి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ సురేఖ మృతదేహం కనిపించింది. అక్క మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించింది.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కానిస్టేబుల్ సురేఖ ఆత్మహత్యకు పెళ్లి కాకపోవడమే కారణమా లేక మరేమైనా కారణాలున్నాయా అన్నకోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.