
రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ఒక అభిమాని రక్తంతో కృతజ్ఞత చెప్పాడు.
బహుశా ఇలాంటి ప్రశంస ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వచ్చి ఉండదు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాజేందర్ చేస్తున్న కృషి కి ఎలా కృతజ్ఞతలుచెప్పాలో తెలియక ఈ అభిమాని రక్తాక్షరాల మార్గం ఎంచుకున్నాడు. ఆయనెవరో కాదు, టీఎన్‌జీవోఎస్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజా హిద్ హుస్సేన్. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం మంత్రి కష్టపడుతున్న తీరుతో ముగ్ధుడయి హుస్సేన్ రక్తంతో లేఖ రాసి పంపించారు. ఎందుకిలా చేశావంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్ అభివృద్ధికి పనులు చేపట్టారు. అంతేకాదు, ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన అంటున్నారు .
‘హజూర బాద్ పట్టణ ప్రజలు సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. ఎందుకంటే, ఇక్కడ రైతు బజార్ నిర్మాణం జరుగుతూ ఉంది. మినీ చెక్ డ్యాంల నిర్మాణం సాగుతూ ఉంది. నూతన హంగులతో శ్మశాన వాటికలు సిద్ధమవుతున్నాయి. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు ఆర్‌డిఒ కార్యాలయ ఏర్పాటు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ఇంతకంటే ఏం కావాలి. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట, పరకాల వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణమవుతూ ఉంది. ఈపనులకు నేను ఈ ప్రాంతవాసిగా మంత్రికి ఎంతో రుణ పడి ఉంటాను. అందుకే మంత్రి ఈటల రాజేందర్ కు రక్తాక్షరాలతో కృతజ్ఞతలు చెబుతున్నాను', అన్నారు.