
రంగారెడ్డి జిల్లా : ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు ఆ ప్రేమికుడు. జీవితాంతం తోడుంటానని తనతో ప్రేమ వాగ్దానాలు చేసి.. చివరికి తనను వదిలేసి మరొకరితో ఏడడుగులు నడిచిందని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఈ బాధలో ఉండగానే ప్రేయసి పెళ్లి ఫోటోలు అతనికంటపడ్డాయి. అవి చూసిన అతని హృదయం మరింత ముక్కలైపోయింది. అంతే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు. ప్రేమ ఒక్కటే జీవితం కాదని.. మరెంతో జీవితం ముందుందని మరిచిపోయాడు. ప్రేయసి మెడలో కట్టాలనుకున్న తాళిని జేబులో పెట్టుకుని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయక నగర్ కాలనీలో ఉండే పందికుంట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతుల కుమారుడు గణేష్. వీరికి ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు గణేష్(23), లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సంవత్సర కాలంగా స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతనిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టు షాక్.. వివాదాస్పద స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశాలు...
అయితే, యువతి తల్లిదండ్రులు ఇటీవల ఆమెకు మరో యువకుడితో పెళ్లి జరిపించారు. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చిన మాట తప్పడమే కాకుండా.. తన పెళ్లి ఫోటోలను ఆమె గణేష్ వాట్సాప్ కి పంపించింది. అవి చూసిన గణేష్ తీవ్రమనస్థాపానికి గురైయ్యాడు. అది తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఎవరికీ కనిపించని గణేష్ మంగళవారం ఉదయం మునగనూరు శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని గణేష్ గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దింపి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు