మూసాపేట మెట్రో స్టేషన్ లో రైలుకు ఎదురుగా దూకి వ్యక్తి ఆత్మహత్య..

By SumaBala BukkaFirst Published Jan 6, 2023, 2:00 PM IST
Highlights

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ ఘటన మరువకముందే మూసాపేటలో మరో వ్యక్తి ట్రైన్ కి ఎదురుగా వెళ్ల దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

హైదరాబాద్ : బుధవారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ మీదినుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే.. మూసాపేట మెట్రో స్టేషన్ లో మరో ఆత్మహత్య వెలుగు చూసింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి మెట్రో ట్రైన్ రావడం గమనించి.. సరిగ్గా అది వచ్చే సమయానికి దాని కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఆ వ్యక్తి ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలన్ని ఉద్దేశంతోనే మెట్రో స్టేషన్ లోకి ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. 

అతను టికెట్ తీసుకోకుండానే మెట్రో స్టేషన్ లోకి వచ్చాడని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అలా వచ్చిన అతను నేరుగా ప్లాట్ ఫాం మీదికి చేరుకున్నాడు. సరిగ్గా రైలు వచ్చే విషయాన్ని గమనించి.. దగ్గరికి రాగానే ఎదురుగా వెళ్లి దూకేశాడు. దీంతో రైలు ఇంజిన్ ఫ్లాట్ ఫాం మధ్యలో అతని శరీరం పడిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యింది. పోలీసులు మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు. 

మాస్టర్ ప్లాన్: కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఆందోళన, అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇదిలా ఉండగా, బుధవారం నాడు  ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మక్తల్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె పేరు మారెమ్మ. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. 

కాగా, ఇలాంటి ఘటనే నిరుడు ఏప్రిల్ లో ఈఎస్ఐ మెట్రో స్టేషన్  లో జరిగింది. అక్కడి మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాలు తెలిపారు. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని (22) బోరబండ శ్రీరామ్ నగర్ దగ్గర్లోని సంజయ్ నగర్ లో ఉంటుంది. ఆమె తండ్రి  ఆటో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. 

ఈమెతో పాటు మరో ఇద్దరు కూతుర్లున్నారు. అయితే ఆమె ఫోన్ లో ఛాటింగ్ చేస్తుండగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె అదేరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ఈఎస్ఐ మెట్రో స్టేషన్ కు వచ్చింది. స్టేషన్ మొదటి అంతస్తు పైకి ఎక్కింది. అక్కడి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రి వైపు కిందకు దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇదిలా ఉండగా, 2021 నవంబర్ 12న కూడా ఇలాంటి ఘటనే ఇదే మెట్రో స్టేషన్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో సదరు యువతి మెట్రో స్టేషన్‌ రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, దూకడంతో పట్టుతప్పి పక్కనే ఉన్న టింబర్‌ డిపోలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

click me!