అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన 'బిసి బంధు'... మనస్తాపంతో ఒకరి సూసైడ్

By Arun Kumar P  |  First Published Oct 9, 2023, 7:57 AM IST

బిసి బంధు డబ్బుల కోసం అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగి చివరకు ఒకరు సూసైడ్ చేసుకున్న విషాద ఘటన  మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. 


మెదక్ : రైతు బంధు,  దళిత బంధు మాదిరిగానే రెక్కల కష్టం మీద బ్రతికే కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం 'బిసి బంధు' అందిస్తోంది. ఈ పథకం కింద బిసి సామాజిక వర్గాలకు చెందిన పేదలను అర్హులుగా గుర్తించి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది సర్కార్. ఇలా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తీసుకువచ్చిన ఈ పథకంతో కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నారు.  దీంతో పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేగి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య బిసిబంధు డబ్బుల విషయంలో వివాదం చెలరేగి ఓ నిండు ప్రాణం బలయ్యింది.  

వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కుమ్మరి ముత్యాలు, శంకర్ అన్నదమ్ములు. ఇద్దరికీ పెళ్ళిళ్లయి భార్యా పిల్లలతో వేరువేరుగా వుంటున్నారు. అయితే  ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 'బిసి బంధు' పథకం కోసం ఇద్దరు అన్నదమ్ములు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికీ బిసి బంధు ఇవ్వడం కుదరదని... ఒకరికి డబ్బులిస్తాం... ఆ డబ్బులు ఇద్దరూ పంచుకోవాలని అన్నదమ్ములిద్దరికి స్థానిక ప్రజాప్రతినిధులు సూచించారు. చెప్పినట్లూ ముత్యాలు పేరిట బిసి బంధు మంజూరుచేసారు. 

Latest Videos

అయితే బిసి డబ్బుల పంపిణీ విషయంలో అన్నదమ్ములు ముత్యాలు, శంకర్ మధ్య వివాదం ఏర్పడింది. తన పేరిట వచ్చిన డబ్బుల్లో సగం తమ్ముడికి ఇచ్చేందుకు ముత్యాలు అంగీకరించాడు. అయితే శంకర్ మాత్రం అన్నతో కలిసి డబ్బులు పంచుకోడానికి ఒప్పుకోకుండా మొత్తం డబ్బులు తనకే కావాలని... లేదంటే మొత్తం నువ్వే తీసుకోవాలని అన్నకు తెలిపాడు. ఇలా ఇద్దరు అన్నదమ్ముల మధ్య బిసి బంధు డబ్బుల విషయంలో కొద్దిరోజులుగా వివాదం సాగుతోంది. 

Read More  సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు : అందుకు ఒప్పుకోలేదని.. ఊపిరాడకుండా చేసి... సంచలన విషయాలు వెలుగులోకి...

కుటుంబానికి  ఆసరాగా వుంటుందనుకున్న బిసి బంధు తనకు రాకపోవడం... డబ్బుల విషయంలో అన్నతో వివాదం రేగడంతో శంకర్ తీవ్ర మనస్ధాపానికి గురయ్యాడు. దీంతో శనివారం అర్ధరాత్రి భార్యాపిల్లలు నిద్రపోయాక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిద్రలేచిన భార్య ఉరికి వేలాడుతున్న భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తూ బయటకు వచ్చి ఇరుగుపొరుగువారికి విషయం తెలిపింది. 

శంకర్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శంకర్ మృతదేహాన్ని పరిశీలించారు. అతడి కుటుంబసభ్యుల నుండి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బిసి బంధు డబ్బుల వివాదమే అతడి ఆత్మహత్యకు కారణంగా కుటుంబసభ్యులు చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!