హైదరాబాద్ లో జరిగిన సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తిని తక్కువకే కొట్టేయాలన్న పథకంలో భాగంగానే అతడిని హత్య చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కలకలంరేపిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ లో వెలుగు చూసిన సినీ నిర్మాత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సినీ నిర్మాత అంజిరెడ్డి దంపతులు తమకున్న ఆస్తులన్నీటిని అమ్మేసి అమెరికా వెళ్లాలని అనుకున్నారు. ఈ విషయం తెలిసిన జి.ఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ఎలాగైనా.. ఆ ఆస్తులన్నింటినీ తక్కువ మొత్తానికి కొట్టేయాలని పథకం వేశాడు.
ఇందులో భాగంగానే తరచుగా అంజిరెడ్డి ఇంటికి వెళ్లి, వస్తుండేవాడు. అంతేకాదు అంజిరెడ్డి ఇల్లు కొనుక్కోవడానికి కావలసిన డబ్బు తన దగ్గర సిద్ధంగా ఉందని మాట్లాడుతుండేవాడు. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఇదే విషయాన్ని పదేపదే అంజిరెడ్డి భార్యకు వినిపించేలా గట్టిగా మాట్లాడుతుండేవాడు. తాను అనుకున్న పథకం పారితే అంజిరెడ్డి భార్యతోనే తాను డబ్బులు ఇచ్చినట్లుగా సాక్ష్యం చెప్పించాలని ఆలోచన చేశాడు.
హైద్రాబాద్‌లో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతిలో కీలక విషయాలు: ఆస్తి కోసం హత్య
ఈ విషయాన్ని నిందితులు పోలీసుల ముందు తెలిపినట్లుగా విశ్వసనీయ సమాచారం. రాజేష్ ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అంజిరెడ్డికి గత నెల 29వ తేదీన ఫోన్ చేసి రెజిమెంటల్ బజార్లో ఉన్న జిఆర్ కన్వెన్షన్ హాలుకు రమ్మని చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత అంజిరెడ్డిపై రాజేష్ ఒత్తిడి చేశాడు. రూ.2.5 కోట్లు ఇచ్చినట్లుగా కొన్ని పత్రాలను సిద్ధం చేసి.. వాటి మీద సంతకం చేయాలని బలవంతం చేశాడు. అంజిరెడ్డి దీనికి ఒప్పుకోలేదు. ఎదురు తిరిగాడు. దీంతో రాజేష్ అతనికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
దీనిమీద దర్యాప్తు చేసిన గోపాలపురం పోలీసులకు విచారణలో ఈ విషయాలు వెలుగు చూసాయి. అంజిరెడ్డి హత్య కేసులో రాజేష్, అతనికి సహకరించిన వారితో కలిసి మొత్తం ఆరుగురిని నిందితులుగా తేల్చి అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడైన రాజేష్ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లుగా తేలింది. రాజేష్ మీద చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఒక యువతి ఆత్మహత్యకు కారణమైనట్లు కేసు నమోదయి ఉంది.