అక్రమాస్తులు 75 కోట్లకుపైనే: మల్కాజ్‌గిరి ఏసీపీ‌ని అరెస్ట్ చేసిన ఏసీబీ

By Siva KodatiFirst Published Sep 23, 2020, 8:24 PM IST
Highlights

అక్రమాస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఆయన అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయి

అక్రమాస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఆయన అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు రూ.75 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది.

వరంగల్, జనగాం, నల్గొండ, కరీంనగర్ , అనంతపురం సహా 25 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ సైబర్ టవర్స్ ఎదురుగా 1,960 గజాల భూమి, మరో 4 ఫ్లాట్లు, హఫీజ్‌పేట్‌లో మూడంతస్తుల కమర్షియల్ బిల్డింగ్‌తో పాటు రెండు ఇళ్లు, రూ.15 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లను అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో ఈ రెండు బ్యాంక్ లాకర్లను రేపు ఉదయం ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ తనిఖీల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు అధికారులు. కొండాపూర్‌లోని సర్వే నంబర్ 64లో అసైన్డ్ భూమిని కొన్నట్లు గుర్తించారు.

ఇందుకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేశానని విచారణలో చెప్పాడు నర్సింహారెడ్డి. దీంతో జగిత్యాల జిల్లా గంగాధరలోని మధుకర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

ఘట్‌కేసర్ అమీన్ పేటలో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేశాడు  నర్సింహారెడ్డి. నిజాం నాటి భూమిని స్థానిక నేతలతో కలిసి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

click me!