తాను ఎనిమిది పెళ్లిళ్లు చేసుకోలేదని.. తనమీద అతి దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని ‘నిత్య పెళ్లికొడుకు’.. ‘మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు’ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గుంటూరు : రెండు రోజుల క్రితం సంచలనం రేపిన ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు.. కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే కాలనీలో మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు.. సెకండ్ మ్యారేజ్ మహిళలే టార్గెట్ అంటూ ఇద్దరు భార్యలు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనమీద అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అడపా శివశంకర్ బాబు మీడియా ముందుకు వచ్చాడు. గౌరవంగా జీవిస్తున్న తన మీద కొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని.. మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు అన్నారు. గుంటూరులోని ఒక లాయర్ ఆఫీసులో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
‘హైదరాబాదులో కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాను. నాకు మామయ్య వరుసయ్యే గల్లా శ్రీనివాస్, గిద్దలూరు ప్రాంతానికి చెందిన గురు శ్రీరంగ శ్రీనివాసులు వ్యాపారాల పేరుతో నా ఆధార్, పాన్ కార్డుల ద్వారా భోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకు రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని యువత వద్ద డబ్బులు తీసుకున్నారు. కంపెనీ పెట్టి మూడు నెలలు గడవక ముందే మూసేశారు. నా అడ్రస్ ఉండడంతో డబ్బులు ఇచ్చినవారు నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. శ్రీరంగ శ్రీనివాస్ కు మహిళల వ్యసనం ఉంది. అమ్మాయిలను తీసుకురావాలని ఒత్తిడి తీసుకు వచ్చేవాడు. నేను అంగీకరించకపోవడంతో ఇద్దరు మహిళలను ప్రోత్సహించి నాపై తప్పుడు ఆరోపణలు చేయించాడు. నేను నిజంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుంటే మిగతావారు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కదా?’ అని ప్రశ్నించాడు.
undefined
తనకు ముందుగానే పెళ్లి అయిందని ఆమెతో చిన్నపాటి మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నానని ఇంకా విడాకులు తీసుకోలేదు అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాను వేరే మహిళతో సహజీవనం చేస్తున్నానని ప్రస్తుతం ఆమె గర్భవతి అని వివరించాడు. అంతేకాదు, తాను ఎక్కడికీ పారిపోలేదని గుంటూరులోనే ఉన్నాను అని తెలిపాడు. తనకు గల్లా శ్రీనివాసులు, శ్రీరంగ శ్రీనివాస్ లతో ప్రాణహాని ఉందని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇదిలా ఉండగా, జూలై 14 న అడపా శివశంకర్ బాబు భార్యలం అంటూ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఇద్దరు మహిళలు అతనిమీద ప్రెస్ మీట్ పెట్టారు. భార్యకు విడాకులు ఇవ్వకూడానే నకిలీ విడాకుల పత్రాలు సృష్టించి పెళ్లి చేసుకున్నాడని, పెళ్లయిన కొన్నాళ్ళు నమ్మకంగా మాట్లాడి.. ఏవో కారణాలు చెప్పి లక్షలో డబ్బు గుంచి ఇప్పుడు మరో మహిళతో కాపురం చేస్తున్నాడు. ఇతడి నిర్వాకంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతని బాధితుల్లో హైదరాబాద్ మహిళలే ఎక్కువ మంది. ఉన్నత విద్యావంతులే. ఉద్యోగాలు చేస్తున్నవారే. మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించడంతోపాటు… తమ లాగా ఇంకెవరూ మోసపోకుండా చూడాలని కోరుతూ ఇద్దరు బాధిత మహిళలు బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వివరాలు వెల్లడించారు.