అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు తక్షణం ఆపేయండి... ఏపీ, తెలంగాణలకు కేఆర్ఎంబీ లేఖ

By Siva Kodati  |  First Published Jul 15, 2022, 9:42 PM IST

కృష్ణా నదీపై అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌లను తక్షణమే నిలిపివేయాలని ఏపీ, తెలంగాణలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. అనుమతుల్లేని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏపీ, తెలంగాణ పరస్పరం ఫిర్యాదులు చేశాయని బోర్డు తన లేఖలో తెలిపింది


కృష్ణా నదీపై అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్‌లను తక్షణమే నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) (krmb) తెలుగు రాష్ట్ర (krishna river management board) ప్రభుత్వాలకు శుక్రవారం లేఖ రాసింది. కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (jal shakti ministry) గతేడాది ఇచ్చిన గెజిట్ నోటిఫిషన్ గడువు ముగియడంతో కేఆర్ఎంబీ ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతుల్లేని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏపీ, తెలంగాణ పరస్పరం ఫిర్యాదులు చేశాయని బోర్డు తన లేఖలో తెలిపింది. ప్రాజెక్ట్ అనుమతులకు కేంద్రం ఇచ్చిన గడువు జూలై 13తో ముగిసిందని ప్రస్తావించింది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు వున్నాయని బోర్డ్ తెలిపింది. మరి కేఆర్ఎంబీ లేఖపై ఏపీ, తెలంగాణలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జూలై 14, 2021 నుంచి కృష్ణా, గోదావరి నదులపై వున్న ప్రాజెక్ట్‌లను తమకు అప్పగించాలని కేంద్ర జలశక్తి బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి ఇవ్వబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. తెలంగాణ ఇస్తేనే తామూ ఇస్తామని ఏపీ ప్రభుత్వం సైతం మెలిక పెట్టింది. మరోవైపు ప్రాజెక్ట్‌ల అప్పగింతపై ప్రత్యేక బోర్డు విధించిన గడువు జూలై 14తో ముగిసింది. 

Latest Videos

Also Read:జలశక్తి బోర్డ్ ప్రయత్నాలు మళ్లీ విఫలం: కృష్ణా, గోదావరి పైనున్న ప్రాజెక్ట్‌లు ఇచ్చేది లేదన్న ఏపీ , తెలంగాణ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు 2021 జూలై 15న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గెజిట్ నోటిఫికేషన్ అదే ఏడాది అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా  వాటిని నిలిపివేయాలి.

కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరి పై 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చాలనే ప్రతిపాదనను మొదటి నుండి  తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఆయా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకుండానే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  తాజాగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ  బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయశాఖ నిపుణులతో చర్చిస్తోంది.
 

click me!