పారిశుద్ద్య కార్మికుల భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 100 రోబోలను కొనుగోలు చేయనుంది. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యాన్ హోల్స్ ను శుభ్రపరిచేందుకు ఈ రోబోలను ఉపయోగించనున్నారు
Maharashtra : పారిశుద్ద్య కార్మికుల భద్రత కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అండర్ గ్రౌండ్ మురికి కాలువల (మ్యాన్ హోల్స్) శుభ్రపర్చేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్దమయ్యారు. ముంబైతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మ్యాన్ హోల్స్ ను మనుషులు కాకుండా రోబోలను ఉపయోగించాలని నిర్ణయించారు. ఇందుకోసం 100 రోబోల కొనుగోలుకు సిద్దమయ్యింది పడ్నవిస్ ప్రభుత్వం.
పారిశుద్ద్యే కార్మికుల మరణాలను నివారించడానికే ఈ రోబోలను తీసుకువస్తున్నట్లు మంత్రి సంజయ్ శిర్సత్ తెలిపారు. మొత్తం 27 మున్సిపల్ కార్పోరేషన్లలో ఈ రోబోలను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించారు. మ్యాన్ హోల్స్ లో దిగే కార్మికులు విషవాయువుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ రోబోలను తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఇప్పటికే చాలారాష్ట్రాల్లో మ్యాన్ హోల్ క్లీనింగ్ కోసం ఈ రోబోలను ఉపయోగిస్తున్నారు. అయితే మొట్టమొదట కేరళ ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత చండీగడ్ మున్సిపాలిటీలో కూడా ఈ రోబోలను ఉపయోగిస్తున్నారు. ఈ రోబోటిక్ యంత్రాల ప్రత్యేకత ఏమిటంటే అవి మనుషుల మాదిరిగానే మ్యాన్‌హోల్‌లను ఖచ్చితంగా శుభ్రం చేస్తాయి. వీటిలోని సెన్సార్లు మ్యాన్‌హోల్స్‌లోని విష వాయువులను కూడా గుర్తించగలవు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మ్యాన్ హోల్స్ క్లీనింగ్ కు ఈ రోబోలనే వాడుతున్నారు.