డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు . హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.
డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందన్నారు. మహిళల స్వయంశక్తి మెరుగవుతుందని .. ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయని సజ్జనార్ ఆకాంక్షించారు. మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీని ఆదేశించారని ఆయన తెలిపారు.
రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ ఇస్తారని సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు , వృద్ధులు ప్రయాణించవచ్చని.. ఏదైనా ఒక గుర్తింపు కార్డు వుంటే చాలని సజ్జనార్ స్పష్టం చేశారు.
Also Read: TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే..
మహిళలు తెలంగాణ సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు మాత్రం మన సరిహద్దు నుంచి టికెట్ కొనుగోలు చేయాలని ఆయన వెల్లడించారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేస్తామని దీనికి వయసుతో సంబంధం లేదని సజ్జనార్ తెలిపారు. చిన్నారులు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు కూడా మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చని.. తొలి వారం రోజులు ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయవచ్చని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులు, స్పెషల్ టూర్ సర్వీసుల్లో మాత్రం ఉచిత ప్రయాణం వుండదని, ఆర్టీసీకి ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని ఎండీ చెప్పారు.