ప్రగతి భవన్ ప్రారంభించిన నాటి శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరును ఎవరో మట్టితో పూసేశారు. కనిపించకుండా చేశారు. కాంగ్రెస్ కార్యకర్త బండి రాకేష్ .. శిలాఫలకంపై కేసీఆర్ పేరున్న చోట ఇలా మట్టి పూశాడంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో యశ్వంత్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత కౌంటరిచ్చాడు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రగతిభవన్ ను జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ గా మార్చారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రగతిభవన్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. అది ఇన్నాళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం.. సామాన్యులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ నిషిద్ధం. ముళ్లకంచెలు, బారికేడ్లు, పోలీసు బందోబస్తు.. అటువైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితి వుండేది. అయితే రేవంత్ రెడ్డి రాకతో ఇప్పుడు ఇది మారింది.
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతిభవన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజూ ప్రగతిభవన్ పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ గా మారుస్తూ.. ప్రమాణ స్వీకార వేదికమీదినుంచే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తరువాత వెంటనే ప్రజాభవన్ ముందున్న ఇనుప కంచెలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆగమేఘాల మీద కంచెల తొలగింపు జరుగుతోంది.
ఇకపై ప్రజాభవన్ కు ఎవరైనా రావచ్చు. ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులు ఉండవని రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారంనాడు జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. జనం వచ్చి తమ వినతులు చెప్పుకోవచ్చని, ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకోవచ్చని తెలిపారు. చెప్పినట్టే శుక్రవారం ఉదయం ప్రజాదర్భార్ లో తనను కలవడానికి వచ్చిన వారి వినతులు స్వీకరించారు రేవంత్ రెడ్డి. సామాన్యులు ప్రగతి భవన్ లో ప్రవేశించి.. ఆసక్తిగా తిలకించారు.
ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన ఫొటో వెలుగు చూసింది. ప్రగతి భవన్ ప్రారంభించిన నాటి శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరును ఎవరో మట్టితో పూసేశారు. కనిపించకుండా చేశారు. ఆవిష్కరించినవారు అని కేసీఆర్ పేరు ఉన్నచోట ఇలా మట్టితో కప్పేసి కనిపించింది. దీన్ని ఓ వ్యక్తి ఆసక్తిగా గమనిస్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ పనేనంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్త బండి రాకేష్ .. శిలాఫలకంపై కేసీఆర్ పేరున్న చోట ఇలా మట్టి పూశాడంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో యశ్వంత్ రెడ్డి అనే కాంగ్రెస్ నేత కౌంటరిచ్చాడు.
ప్రజాభవన్‌లో శిలాఫలకంపై వున్న పేరు కనపడకుండా ఎన్నికల కోడ్ అమల్లో వున్నప్పుడు ఎన్నికల అధికారులు చేశారని యశ్వంత్ రెడ్డి చెప్పారు. కానీ కొన్ని బానిస పింకీలు ఇప్పుడు చేసినట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిని తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.