యాదాద్రి: రేపే మహా కుంభ సంప్రోక్షణ

Published : Mar 27, 2022, 03:19 PM IST
యాదాద్రి: రేపే మహా కుంభ సంప్రోక్షణ

సారాంశం

యాదాద్రి ఆలయం పున: ప్రారంభోత్సవంలో ప్రధాన ఘట్టం రేపు జరగనుంది. మహా కుంభ సంప్రోక్షణ కోసం ఏర్పాట్లు జరిగాయి. ఈ ఆలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

యాదగిరిగుట్ట: Yadadri ఆలయంలో  Maha kubh samprokshanam  సోమవారం నాడు జరగనుంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యంత కీలకమైందిగా భావిస్తారు.యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. దేశంలోని పలు ప్రసిద్ద ఆలయాలకు ధీటుగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. 

యాదాద్రిలో వెలసిన పంచ నారసింహక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు స్వయంభువులుగా వెలసిన ఈ దివ్యక్షేత్రాన్ని దేశంలోని ఇతర దివ్యక్షేత్రాల్లోని మరే ఆలయానికీ తీసిపోని రీతిలో వివిధ శిల్పకళా శైలుల వైభవం ఒకేచోట భక్తులకు కనువిందు చేసేలా నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ నిర్మాణంలో శ్రేష్ఠమైన కృష్ణశిలదే సింహభాగం. ఆలయ పునర్నిర్మాణం కోసం ఏకంగా 9.5 లక్షల ఘనపు మీటర్ల కృష్ణశిలను వినియోగించారు.

ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలను వినియోగించారు. ఆధునికకాలంలో ఇలా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ నిర్మాణం చేపట్టారు.  పదిమంది స్థపతులు, ఎనిమిదివందల మంది శిల్పులు ఆలయ మండపాలు, గోపురాలపై 541 దేవతారూపాలను, 58 యాలీ పిల్లర్లను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు.

 ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం Andhra pradesh ప్రకాశం జిల్లాGurujapalli లో నాణ్యమైన కృష్ణశిల లభించడంతో Temple నిర్మాణానికి అవసరమైన మొత్తం శిలను ఆ గ్రామంలోని ఒకే క్వారీ నుంచి సేకరించారు. యాదాద్రి ఆలయాన్ని శ్రీవైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా తీర్చిదిద్దారు.

వైష్ణవ భక్తిసంప్రదాయాన్ని ప్రచారం చేసిన పన్నెండు మంది ఆళ్వార్ల విగ్రహాలను రెండో అంతస్తులో కాకతీయ స్తంభాలు, అష్టభుజి మండపాలు, మాడవీథులు, పురవీథుల ప్రాకారాలు, త్రితల, పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు నిర్మించారు. YTDA వైస్‌ చైర్మన్‌ Kishan Rao , ఈవో గీతారెడ్డి, ఇతర అధికారులు దేశవ్యాప్తంగా సంచరించి, వివిధ ఆలయ శిల్పరీతులను పరిశీలించి వచ్చారు. చెన్నై, మహాబలిపురం, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి దాదాపు రెండువేల మంది శిల్పులు యాదాద్రి పునర్నిర్మాణంలో పాల్గొన్నారు.

ఇదివరకు యాదాద్రి చుట్టూ కలిపి 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు దీనికి ఇంకో గుట్టను జోడించి మరో మూడెకరాలను కలిపారు. ఉపరితలం నుంచి ఎనభై అడుగుల ఎత్తువరకు ఉన్న కొండను కాంక్రీటుతో నింపకుండా, సహజసిద్ధంగా ఉండేలా మట్టితో ఎనభై అడుగుల ఎత్తు వరకు నింపి మూడెకరాలను విస్తరించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సీఎం KCR దాదాపు 2,400 డ్రాయింగ్‌లను పరిశీలించి ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. మొత్తం ఆలయ నిర్మాణమంతా యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ఆధ్వర్యంలో జరిగింది.

వైటీడీఏ చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కిషన్‌రావు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని రూ.1800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. దీని వ్యయం రూ.1200 కోట్లకు పరిమితమైంది. ఇందులో భూసేకరణ కోసమే ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు రెండువేల ఎకరాల భూమిని సేకరించారు. ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు ఖర్చు చేశారు. రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి వాటికి భారీగా ఖర్చు చేశారు. రోజుకు నలభైవేల మంది భక్తులు వచ్చినా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 15 VVIP కాటేజీలను నిర్మించారు. దాతల సహకారంతో 252 వీఐపీ కాటేజీలను నిర్మించనున్నారు. 

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంటు వాడలేదు. పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన గానుగ సున్నాన్నే ఉపయోగించారు. ఆలయంలోని తలుపులకు వాడిన కలపకు సైతం క్షుణ్ణంగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే వాటిని అమర్చారు. 

ఇప్పుడున్న యాదాద్రికి తోడుగా మరో 850 ఎకరాలలో టెంపుల్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం దాదాపు వెయ్యికి పైగా వసతి గృహాలను అక్కడ నిర్మించనున్నారు. తొలిదశలో 252 వీఐపీ కాటేజీలను ఒక్కొక్కటి రూ.1.50 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి దాతలు ఏడాదిలో ముప్పయి రోజులు ఈ వసతిగృహాల్లో ఉండవచ్చు. వీటికి తోడు 13.5 ఎకరాల్లో ప్రత్యేకంగా వీవీఐపీల కోసం ప్రెసిడెన్షియల్‌ సూట్ల పేరిట 15 కాటేజీలను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఒక్కోదానికి ఏడు కోట్లు ఖర్చు చేశారు. 

కొండపైన విష్ణుపుష్కరిణి, కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణి, స్వామివారి తెప్పోత్సవం కోసం గండిచెరువు, కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, నిత్యాన్నదాన సత్రం, సత్యనారాయణస్వామి వ్రతమండపం,  బస్టాండులు, గుట్ట చుట్టూ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఐదువందల బస్సులు తిరిగేందుకు అనువుగా బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ అనుసంధానిస్తూ ఆరులేన్ల రహదారిని నిర్మించారు.ఈ రహదారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలను పెంచడంతో, ఈ మార్గం పూలవనాన్ని తలపిస్తుంది. ఈ మార్గంలో నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన కూడళ్లలోనూ పూలమొక్కలను ఏర్పాటు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu