మాదాపూర్ కాల్పుల కేసు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..

Published : Aug 02, 2022, 02:27 PM ISTUpdated : Aug 02, 2022, 03:35 PM IST
మాదాపూర్ కాల్పుల కేసు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..

సారాంశం

హైదరాబాద్ మాదాపూర్‌లో కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇస్మాయిల్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.

హైదరాబాద్ మాదాపూర్‌లో కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇస్మాయిల్ అనే వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. భూవివాదాలే ఈ కాల్పులకు దారితీశాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. ఇప్పటికే పోలీసులు జిలానీ, ఫిరోజులను అదుపులోకి తీసుకోగా.. తాజాగా ముజాహిద్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టయింది. పోలీసులు నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వెపన్స్, కార్లు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్‌లోని కాలాపత్తర్‌కు చెందిన ఇస్మాయిల్‌‌పై పలు కేసులు ఉన్నాయి. అతనికి జైలులో దుండిగల్‌కు చెందిన ముజాహిద్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు జహీరాబాద్‌, సంగారెడ్డిలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం భూదందాలకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. ఇందుకు సంబంధించి వారం క్రితం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని  సమాచారం. అయితే వివాదాలపై మాట్లాడుకునేందకు ఆదివారం సాయంత్రం ముజాహిద్‌ నుంచి ఇస్మాయిల్‌కు ఫోన్‌ వచ్చింది.  ఆదివారం రాత్రి వారు మాసబ్ ట్యాంక్ వద్ద కలుసుకున్నారు. ఇస్మాయిల్ వెంట బహదూర్‌పురాకు చెందిన అక్రం, గౌస్, జహంగీర్‌లు.. ముజాహిద్ వెంట అతని వద్ద పనిచేసే జిలానీ, ఫెరోజ్‌లు అక్కడికి వచ్చారు. 

ఆ తర్వాత అర్దరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మాదాపూర్‌‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున టిఫిన్ చేస్తుండగా.. ముజాహిద్ అనుచరుడు జిలానీ వెనుక నుంచి వచ్చి ఇస్మాయిల్‌పై కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్చాడు. దీంతో జహంగీర్ జోక్యం చేసుకోగా అతనిపై కూడా దాడి చేశారు. అనంతరం ముజాహిద్, జిలానీ, ఫెరోజ్‌ అక్కడి నుంచి కారులో పరారయ్యారు. మరోవైపు అక్రం, గౌస్‌ తాము వచ్చిన స్విఫ్ట్‌ కారులో ఇస్మాయిల్, జహంగీర్‌లను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్‌ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 

ఇక, ఈ ఘటనలో ఇస్మాయిల్ బుల్లెట్ గాయంతో మరణించడాని.. అతని స్నేహితుడు జహంగీర్ బుల్లెట్ గాయమైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడని మాదాపూర్‌ ఇన్‌చార్జి డీసీపీ సందీప్ రావు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మరొక నిందితుడు ముజాహిద్ సమక్షంలో ఇస్మాయిల్‌పై  జిలానీ కాల్పులు జరిపాడు. అయితే నిందితుడు, బాధితుడు ఇద్దరికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడికి గతంలో ఒక హత్య కేసులో జీవిత ఖైదు విధించబడిందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్