
2014కు ముందు కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ తల్లిని విముక్తి చేయాలనే అంతా ఒక్కటయ్యారని అన్నారు బీజేపీ (bjp) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) . రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) తలపెట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) ప్రారంభోత్సవం సందర్భంగా యాదాద్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరా పార్క్ వద్ద మళ్లీ టెంట్లు మొదలయ్యాయని అన్నారు. తనను మించిన నాయకుడు లేడని కేసీఆర్ విర్రవీగుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కానీ కేసీఆర్ వెన్ను ఆయనకు కనిపించడం లేదని.. అది ప్రజలకు కనిపిస్తోందన్నారు.
బండి సంజయ్ పాదయాత్రకు తోడుగా.. పల్లెల్లో ప్రజల గోస.. భారతీయ జనతా పార్టీ భరోసా అనే యాత్ర కూడా కొనసాగుతోందని ఈటల తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఏదైనా సమస్య వస్తే ప్రగతి భవన్‌లో కానీ సచివాలయంలో కానీ కలిశారా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ప్రాచీన కాలంలో రాజులు కూడా మారు వేషంలో గుర్రాల మీద , ఏనుగుల మీద ప్రజల కష్టాలు తెలుసుకునేవారని .. కానీ ఈ రాజు మాత్రం వుంటే ప్రగతి భవన్‌లో , లేదంటే ఫామ్‌హౌస్‌లో వుంటాడని రాజేందర్ దుయ్యబట్టారు. అది కూడా ఇనుప కంచెల మధ్య.. వేల మంది పోలీసుల మధ్య పరిపాలన కొనసాగించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని ఈటల ఎద్దేవా చేశారు.
హుజురాబాద్‌లో గుద్దితే కేసీఆర్‌కు (kcr) దిమ్మ తిరిగిపోయిందని ఆయన సెటైర్లు వేశారు. దళితులకు ఇచ్చిన వేలాది ఎకరాల అసైన్‌మెంట్ భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని రాజేందర్ ఆరోపించారు. కానీ దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ అని ఆయన ప్రశంసించారు. ప్రజల్ని కేసీఆర్ ఎప్పుడో వదిలేశారని.. గిరిజనులకు 9 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీ ఏమైందని రాజేందర్ ప్రశ్నించారు. గిరిజన భూముల్ని కూడా ఈ ప్రభుత్వం గుంజుకుంటోందని రాజేందర్ ఆరోపించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వుందని.. 20వ రాష్ట్రం తెలంగాణ కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.