రేవంత్ కేబినెట్ లో ఐటీ మంత్రిగా కొత్తపేరు తెరపైకి? ఎవరీ మదన్ మోహన్ రావు..?

By Arun Kumar P  |  First Published Dec 8, 2023, 2:09 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఎంత చర్చ జరిగిందో ఇప్పుడు అదేస్థాయిలో ఐటీ మంత్రిపై చర్చ సాగుతోంది. తాజాగా ఐటీ మంత్రి ఈయనే అంటూ కొత్తగా మరోపేరు ప్రచారంలోకి వచ్చింది. 


హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న(గురువారం) రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసారు. కానీ ఇప్పటివరకు మంత్రుల శాఖల కేటాయింపుపై స్పష్టత లేదు. కానీ మంత్రులకు శాఖలు కేటాయించినట్లు... ఉత్తమ్ కు హోం, భట్టికి రెవెన్యూ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రమాణస్వీకారం చేసినవారిలో ఎవరికీ ఐటీ శాఖ కేటాయించలేదు... దీంతో కొత్తగా మంత్రివర్గంలో చేరేవారికే ఈ శాఖ అప్పగించే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. 

బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేసారు. ముఖ్యమంత్రి తనయుడు కావడంతో కేటీఆర్ ఐటీ శాఖకు సంబంధించిన నిర్ణయాలు స్వేచ్చగా తీసుకునేవారు. దీంతో తెలంగాణ మరీముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీరంగం చాలా అభివృద్ది చెందింది. ఎవరూ ఊహించని స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఐటీ జోరు కొనసాగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ కే ఐటీ పదవి కట్టబెట్టాలని సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్, యువత సోషల్ మీడియా వేదికన డిమాండ్ చేస్తున్నారు.  

Latest Videos

దీంతో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఐటీ శాఖపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో అందరూ సీనియర్లే వున్నారు... వీరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా వుంది. అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నత విద్యావంతుడు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఐటీ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాకాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే కొంతకాలం ఐటీశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే వుండనుంది.

Read More  త్వరలోనే మంచిరోజులు వస్తాయన్నారు... ఇంతలోనే ఇలా : కేసీఆర్ గాయంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆవేదన  

ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో కేవలం 11 మంది మాత్రమే వున్నారు... కాబట్టి మరో ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం వుంది. కాబట్టి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ వుంటుందని... అప్పుడు ఐటీ రంగంపై అనుభవం వున్నవారికి అవకాశం కల్పించవచ్చని అంటున్నారు. అతడికే ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. 

మదన్ మోహన్ రావు ఐటీ రంగంలో కొనసాగి రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు విదేశాల్లో ఐటీ కంపనీలను నడిపిస్తున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ టీంలో ఐటీ పరంగా సేవలందించారు. ఇలా ఐటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన మదన్ మోహన్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఐటీ శాఖను అప్పగించే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇలాంటివారు అయితేనే కేటీఆర్ ను మరిపించేలా ఐటీ అభివృద్దిని కొనసాగించగలరని కాంగ్రెస్ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయట. ఐటీ శాఖ ఎవరికి దక్కుతుందో తెలీదు... కానీ ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఎంత చర్చ జరిగిందో అదేస్థాయిలో ఐటీ మంత్రిపై చర్చ సాగుతోంది. 

click me!