పెళ్లికి తిరస్కరించిందని ప్రియురాలి హత్య.. గొంతు నులిమి పాతిపెట్టిన ప్రియుడు

By Mahesh KFirst Published Sep 9, 2022, 4:55 AM IST
Highlights

వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం మానేసిందని, పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు కక్ష్య గట్టాడు. మాట్లాడుకుందామని పిలిచి చున్నీతో గొంతు నులిమి ఆ అమ్మాయిని చంపేశాడు.

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి హఠాత్తుగా పెళ్లికి నిరాకరించిందని ఆ ప్రియుడు కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు. తన మాట వినకుంటే.. హతమార్చడానికి వెనుకాడలేదు. పెళ్లికి అంగీకరించని తర్వాత ఓ సారి మాట్లాడుకుందాం అని ఆ అమ్మాయిని పిలిచాడు. ఆ మాటలు నమ్మి ఆమె వచ్చేసింది. పెళ్లి ప్రస్తవన మళ్లీ తెచ్చాడు. కానీ, ఆమె సమాధానంలో మార్పు లేదు. దీంతో ఆమెను చున్నీతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత బంధువు సహాయంతో గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాడు. ఈ ఘటన 5వ తేదీన జరగ్గా.. ఆలస్యంగా 8వ తేదీన వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మానాజీపేటకు చెందిన అంజన్న శంషాబాద్ దగ్గర 20 ఏళ్లుగా కుటుంబ సమేతంగా జీవిస్తున్నాడు. అంజన్న చిన్న కొడుకు శ్రీశైలంకు ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్‌లో కాటేదాన్‌కు చెందిన సాయిప్రియ (20)తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం స్నేహం.. ప్రేమగా మారింది.

వారి మధ్య ఏర్పడ్డ ప్రేమ గురించి శ్రీశైలం ఇరుకుటుంబాలకు చెప్పాడు. సాయి ప్రియ కుటుంబ సభ్యులు వారి ప్రేమకు నో చెప్పారు. సాయిప్రియతో పెళ్లిని వారు నిరాకరించారు. తల్లిదండ్రుల మాటలకు లోబడి సాయి ప్రియ శంకర్‌తో మాట్లాడటం మానుకుంది. అదే సందర్భంలో కరోనా కారణంగా అబ్బాయి కుటుంబం వారి స్వగ్రామం మానాజీపేటకు వెళ్లింది.

అయితే, తాజాగా, మూడు నెలల క్రితం మళ్లీ వారి మధ్య మాటలు కలిశాయి. సాయిప్రియతో మాట్లాడాలని అబ్బాయి ప్రతిపాదించాడు. ఇందుకు అంగీకరించి ఈ నెల 5న సాయిప్రియ భూత్పూర్ వరకు వచ్చింది. అక్కడి నుంచి శ్రీశైలం బైక్ పై మానాజీపేటకు తీసుకెళ్లాడు. ఆ గ్రామంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మళ్లీ పెళ్లి విషయమై గొడవ జరిగింది. అనంతరం, శ్రీశైలం.. సాయిప్రియ గొంతును ఆమె చున్నీతో నులిమేశాడు. శ్రీశైలం తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో సాయిప్రియ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

కాగా, బయటకు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మైలార్ దేవ్ పల్లి పోలసీు స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం ఖిల్లాఘనపురం పోలీసు సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సాయిప్రియను తానే చంపేశానని అంగీకరించాడు.

click me!