తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ కార్యం జరుపుకోవాలన్న నగదు చేతిలోకి తీసుకోవడమే కష్టంగా మారితే.. ఉన్న నగదుతో వేడుక చేయడం కూడా కష్టమే అవుతున్నది. శుభకార్యంలో ముక్కా, చుక్కాను ఏర్పాటు చేయడం కత్తిమీద సవాలుగా మారింది. దీంతో ఖైరతాబాద్‌లోని ఓ కుటుంబం ఆహ్వానంతోపాటు వారికి ఇష్టమైన బ్రాండ్ మందును అందించి.. వేడుకకు వచ్చి ఆశీర్వదించి ముక్కలతో భోంచేసి పోవాలని కోరింది.
అసలే ఎన్నికల కోడ్.. కానీ, శుభ కార్యాన్ని వాయిదా వేస్తామా? ఎలాగైనా ఆత్మీయులను ఆహ్వానించి మంచి పండుగ చేసుకోవాల్సిందే. పండుగ అంటే చుక్క, ముక్క గ్యారంటీగా ఉండాల్సిందే. ముక్క అంటే వండేయగలం కానీ, చుక్కతోనే చిక్కు వచ్చింది. మందు బాటిళ్లు ఒక దగ్గరకు తెచ్చుకుని పుచ్చుకుంటే పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్నారా? అనే అపప్రద, అభద్రత తప్పదు. అందుకే ఆ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమ బంధువులకు ఏ లోటు రానీయవద్దు అని అనుకుంది. అలాగే.. శుభకార్యం శుభప్రదంగా జరిగిపోవాల్సిందేనని సంకల్పించింది.
ఖైరతాబాద్‌కు చెందిన ఓ కుటుంబం శుభకార్యం కోసం అన్ని సిద్ధం చేసుకున్నా.. ఎన్నికల కోడ్‌తో సెలబ్రేషన్‌లో కొత్త ట్విస్ట్ పట్టుకువచ్చింది. తమ బంధువులు, ఆత్మీయులకు పండుగ కోసం ఆహ్వానిస్తూనే ఇన్విటేషన్ కార్డుతోపాటు మందు బాటిల్ కూడా పంపించేసింది. అదీ ఇదీ అని కాదు.. సదరు వ్యక్తికి ఇష్టమైన బ్రాండ్‌ను అందించింది. ఎన్నికల కోడ్ కాబట్టి ఆ లిక్కర్‌ను వారి ఇంటి వద్దే పుచ్చుకుని మెల్లిగా సెలెబ్రేషన్‌కు అటెండ్ అయితే చాలు. శుభకార్యం నిర్వహిస్తున్న వేదిక వద్ద ఎలాగూ ముక్కలతో విందు చేసుకోవచ్చు.
Also Read: Congress: తెలంగాణలో కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుంటుందా? చరిత్రలో ఇన్ని సీట్లు ఎప్పుడైనా గెలిచిందా?
ఈ ఇన్విటేషన్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపింది. ఎన్నికల కోడ్‌లోనూ బంధువులకు చుక్కా, ముక్కా లోటు రాకుండా వినూత్నంగా ఆ కుటుంబం ఆలోచించిందని అనుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాంపెయిన్ పీక్ స్టేజ్‌లో ఉన్న తరుణంలోనూ తమ వేడుకకు రాజకీయ వాసనలు అంటుకోకుండా జాగ్రత్తపడ్డారు.