రోడ్డు పక్కన చనిపోయిన చిరుత.. వలస వచ్చిన పులి?

By AN TeluguFirst Published Dec 8, 2020, 10:42 AM IST
Highlights

ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్‌ మండలం చింతగూడ వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం వాహనదారులు రోడ్డుపక్కన చిరుతపులి పడిపోయి ఉండటాన్ని గమనించారు. 

ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే దారిలో 44వ జాతీయ రహదారిపై గుడిహత్నూర్‌ మండలం చింతగూడ వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం వాహనదారులు రోడ్డుపక్కన చిరుతపులి పడిపోయి ఉండటాన్ని గమనించారు. 

కదలిక లేకపోవడంతో కొంతమంది దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. వెం టనే గుడిహత్నూర్‌ పోలీసులకు సమాచారం అం దించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత రోడ్డుపైకి వచ్చినప్పుడు ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

మంచిర్యాల, అటవీ సమీప పల్లెల్ని పులి భయం వీడట్లేదు. పులి సంచారం అధికంగా ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట మండలంలోని పది గ్రామాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. గత నెలలో ఇద్దరు గిరిజనులను పొట్టనబెట్టుకున్న పులులను బంధించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. 

సోమవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ, అధికారులు, ప్రజాప్రతినిధులు పులుల దాడిలో మరణించిన విఘ్నేశ్, నిర్మల కుటుంబాలను పరామర్శించేందుకు కొండపల్లికి వచ్చారు. అదే సమయంలో యువతిపై దాడిచేసి చంపిన గ్రామమైన కొండపల్లి శివారు శివయ్యకుంటలో మళ్లీ పులి కనిపించడంతో.. పత్తిచేల నుంచి మహిళలు భయంతో పరుగులు తీశారు. పులి భయంతో కూలీలు రాకపోవడంతో చేలలోనే పత్తి ఉండిపోతోందని రైతులు వాపోతున్నారు.

రాష్ట్రంలో కొత్త పులుల రాకతో అడవుల్లో గాండ్రింపులు పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ పులుల అభయారణ్యానికి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి వలస వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్‌ రిజర్వు నుంచి పులులు సరిహద్దు దాటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అడుగుపెడుతున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. గుండాల, ఇల్లెందు, ఆళ్లపల్లి, మణుగూరు, కరకగూడెం, అశ్వరాపురం అడవుల్లో పులి జాడలు బయటపడ్డాయి. మూడ్రోజుల క్రితం ములుగు, వరంగల్‌ రూరల్‌ జిల్లాల సరిహద్దు నర్సంపేట అడవుల్లో ఆవును చంపిన పులిని గుర్తించే పనిలో అధికారులున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్‌లోని కోటపల్లి రేంజీలోకి మరో రెండు పులులు వచ్చాయి. ఇందులో ఒకటి గత వేసవిలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌కు వలస వచ్చింది కాగా.. మరొకటి కొత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే చెన్నూరు ప్రాంతంలో రెండు పులులున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోనే పది పులుల వరకు సంచరిస్తున్నాయి. కొత్త పులుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారి పులులు గ్రామశివార్లు, పొలాల్లోకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. అలాగే, మగపులులు తోడు కోసం వెతుక్కుంటూ అడవి దాటి బయటకొస్తున్నాయని చెబుతున్నారు.

click me!