ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడు శివకుమార్ గతంలో తల్లిదండ్రులను దారుణంగా హతమార్చినట్లు షాకింగ్ విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్ : హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శివకుమార్ కు గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ప్రేమ వ్యవహారంలోనే మందలించినందుకు సొంత తల్లిదండ్రులని దారుణంగా హత్య చేశాడని సమాచారం.
గతంలో ఓ యువతీ వెంటపడి వేధిస్తుండడంతో తండ్రి మందలించడంతో.. కోపానికి వచ్చిన శివకుమార్ కన్నతండ్రిని సుత్తితో మోది హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా నేరేళ్ల చెరువుకు చెందిన శివకుమార్ మొదటి నుంచి ర్యాష్ గా ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో తల్లిదండ్రులను కిరాతకంగా హతమార్చాడని.. అయితే, ఈ విషయం బయటికి రాకుండా ఉండిపోయిందని తెలిపారు.
ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘటన : ఝాన్సీ చూపించిన సాహసం.. సంఘవిని కాపాడింది...
ఇప్పుడు ఎల్బీనగర్లో.. యువతి సంఘవిపై పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదంటూ దాడి చేసిన ఘటనలో.. యువతి సోదరుడు పృథ్వి మృతి చెందాడు. ఈ ఘటనలో పట్టుబడిన శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. దాడికి సంబంధించి దర్యాప్తులో భాగంగా శివకుమార్ నేరచరిత్ర వెలుగు చూస్తోంది.
దీంతో పోలీసులు..ఈ హత్యలన్నింటిమీద దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. తండ్రి హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు నిందితుడికి ఉన్న మొత్తం నేరచరిత్రను తవ్వే పనిలో పడ్డారు.